కమ్యూనిస్టులకు లోకేష్‌ క్షమాపణలు.. ఎందుకంటే!

2024-08-02 02:57:31.0

గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఇదే తరహాలో అరెస్టులు చేస్తే విమర్శించి.. ఇప్పుడు అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం నిర్బంధ చర్యలను కొనసాగిస్తోందని లేఖలో మండిపడ్డారు.

https://www.teluguglobal.com/h-upload/2024/08/02/1349044-minister-lokesh-apologizes-to-communists-for-house-arrests.webp

ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటన సందర్భంగా విపక్ష నేతలను, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేయడం ప్రస్తుత రాజకీయాల్లో కామన్ అయిపోయింది. గురువారం సత్యసాయి జిల్లా మడకశిరలో పెన్షన్‌ పంపిణీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు స్థానిక సీపీఎం నేతలను ముందస్తు అరెస్టు చేశారు.

అయితే పార్టీ నేతల అరెస్టులను సీపీఎం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ఓ లేఖను విడుదల చేశారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఇదే తరహాలో అరెస్టులు చేస్తే విమర్శించి.. ఇప్పుడు అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం నిర్బంధ చర్యలను కొనసాగిస్తోందని లేఖలో మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి నిరంకుశ చర్యలను ప్రజలు సహించరని లేఖలో పేర్కొన్నారు. కాగా, శ్రీనివాస రావు లేఖపై స్పందించారు మంత్రి లోకేష్‌. సీపీఎం నేతల అరెస్టు పట్ల క్షమాపణ కోరారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

నారా లోకేష్‌ ట్వీట్‌ ఇదే –

మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ ట్వీట్‌ పెట్టారు లోకేష్‌. సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాలని కోరారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు. గత ప్రభుత్వం పోయినప్పటికీ ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వబోమని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాపాడతామన్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారుల్ని లోకేష్ కోరారు.