2024-10-29 15:22:04.0
హర్యానా ఎన్నికలపై కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు ఈసీ లేఖ రాసింది.
https://www.teluguglobal.com/h-upload/2024/10/29/1373701-kharge.webp
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆరోపణలు చేస్తుండడంపై భారత ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ప్రతికూల ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ విమర్శించింది.కాంగ్రెస్ పార్టీపై భారత ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా శాసన సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఇప్పటికైనా ఎన్నికల అనంతరం నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఈసీ లేఖ రాసింది. ‘ఓటింగ్, కౌంటింగ్ సమయంలో బాధ్యతారాహిత్య ఆరోపణలు చేయడం సరికాదు.ప్రధానంగా హర్యానా ఎన్నికల రిజల్ట్స్ వెలువడిన అక్టోబర్ 8న అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్స్ దాదాపు 2 గంటలపాటు చాలా నెమ్మదించాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు పేర్కొంది. హర్యానా ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రతీ చర్య కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేదా ఏజెంట్ల పర్యవేక్షణలోనే జరిగినట్టు పేర్కొంది.
ఈ మేరకు మంగళవారం మొత్తం 1,600 పేజీలతో కూడిన అధికారిక ప్రతిస్పందనను విడుదల చేసింది. ఓట్లు వేసేటప్పుడు, కౌంటింగ్ సమయంలో నిరాధారమైన, సంచలనాత్మక ఫిర్యాదులు చేయడం మానుకోవాలని కాంగ్రెస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం హెచ్చరించింది. బాధ్యతా రహితమైన ఈ ఆరోపణలు ప్రజల్లో అశాంతి, అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయని, గందరగోళానికి దారితీస్తాయని ఈసీ పేర్కొంది. అనవసరమైన ఈ తరహా ఫిర్యాదుల ధోరణిని అరికట్టడానికి దృఢమైన, కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను కోరింది. ఇక హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా కాంగ్రెస్ వాదనలను ఖండించారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు అనంతరం కాంగ్రెస్ ఈసీకి పలు ఫిర్యాదులు చేసింది. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని పేర్కొంంది. అంతేగాక 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో కౌంటింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లు కొన్ని కేంద్రాల్లో 99 శాతం బ్యాటరీ సామర్థ్యంతో పని చేస్తుండగా, మరికొన్ని 60-70, 80 శాతం కంటే తక్కువ బ్యాటరీ సామర్థ్యంతో పని చేస్తున్నాయని దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఈసీ సమాధానం ఇచ్చింది. అవన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది.
Election Commission of India,Mallikarjuna Kharge,Congress party,Haryana assembly elections,EVM,EC