కామారెడ్డి డిక్లరేషన్‌ అమలుపై ప్రభుత్వం తాత్సారం

2025-01-01 11:29:51.0

బీసీ మహాసభకు పెద్ద ఎత్తున తరలిరండి : ఎమ్మెల్సీ కవిత

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. డిక్లరేషన్‌లో ప్రకటించినట్టుగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని ఈనెల 3వ తేదీన ఇందిరాపార్క్‌లో తలపెట్టిన బీసీ మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం తన నివాసంలో బీసీ మహాసభ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. బీసీలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే బీసీ మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. బీసీ మహాసభకు రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ, ప్రజాసంఘాలు, వివిధ బీసీ కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. కార్యక్రమంలో బీసీ నాయకులు బొల్లా శివశంకర్, పెంట రాజేశ్‌, సుంకోజు కృష్ణమాచారి, ఆలకుంట్ల హరి, కుమారస్వామి, విజేందర్ సాగర్, రాచమల్ల బాలకృష్ణ, కోళ్ల శ్రీనివాస్, సాల్వాచారి, మురళి, నిమ్మల వీరన్న, లింగం, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట విద్యార్థి జేఏసీ నాయకులు బుధవారం బీసీ మహాసభ పోస్టర్‌ ఆవిష్కరించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి కృషి చేస్తున్నాయని తెలిపారు.

 

Kamareddy BC Declaration,Reservations Hike,Local Bodies,BC Mahasabha,Indira Park,MLC Kavitha,Telangana Jagruthi