కాళ్ల కండరాల బలంతో గుండె పదిలం

https://www.teluguglobal.com/h-upload/2023/06/02/500x300_774652-leg-workout.webp
2023-06-02 03:41:49.0

హార్ట్ ఎటాక్ వచ్చిన వారిలో కాళ్ల కండరాలు బలంగా ఉన్నవారు ఎక్కువకాలం జీవిస్తున్నారని, కాళ్లు బలహీనంగా ఉన్నవారితో పోల్చినప్పుడు వీరిలో హార్ట్ ఎటాక్ అనంతరం మరణ ప్రమాదం తక్కువగా ఉంటున్నదని అధ్యయనాల్లో తేలింది.

వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా అవసరమని మనకు తెలుసు. అయితే మన శరీరంలోని ప్రతి అవయవానికి దాని ఆరోగ్యాన్ని మెరుగుపరచే ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. అలా చూసినప్పుడు కాళ్లకు శ్రమ కలిగించే వ్యాయామాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయంటున్నారు పరిశోధకులు. హార్ట్ ఎటాక్ వచ్చిన వారిలో కాళ్ల కండరాలు బలంగా ఉన్నవారు ఎక్కువకాలం జీవిస్తున్నారని, కాళ్లు బలహీనంగా ఉన్నవారితో పోల్చినప్పుడు వీరిలో హార్ట్ ఎటాక్ అనంతరం మరణ ప్రమాదం తక్కువగా ఉంటున్నదని అధ్యయనాల్లో తేలింది.

కాళ్లకు శ్రమ కలిగించే వ్యాయామాలు చాలా కష్టంగా అనిపిస్తాయి. కాళ్ల కండరాలు నొప్పులకు గురవుతుంటాయి. కానీ కాళ్లకు శక్తినిచ్చే వ్యాయామాలు గుండెకు చేసే మేలు గురించి తెలుసుకుంటే ఎన్ని నొప్పులున్నా ఆ వ్యాయామాలు చేయాలనే అనుకుంటారు ఎవరైనా.

యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన శాస్త్రీయ సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు పేర్కొన్న సమాచారం ప్రకారం… 2007 నుండి 2020 వరకు అక్యూట్ మయోకార్డియల్ ఇన్ ఫార్క్షన్ గా పిలువబడే హార్ట్ ఎటాక్ కి గురయి హాస్పటల్ లో చేరిన 932మందిపై పరిశోధనలు నిర్వహించారు. అక్యూట్ మయోకార్డియల్ ఇన్ ఫార్క్షన్… అనంతర కాలంలో ఎంతమందిలో హార్ట్ ఫెయిల్యూర్ కి దారితీసిందో గమనించారు.

ఎవరిలో అయితే తొడ కండరాలు బలంగా ఉన్నాయో వారిలో హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం తక్కువగానూ, ఈ కండరాలు బలహీనంగా ఉన్నవారిలో గుండెవైఫల్యం ఎక్కువగానూ ఉండటం పరిశోధకులు గుర్తించారు. కాళ్ల తొడల కండరాలు బలంగా ఉండటం వలన హార్ట్ ఎటాక్ వచ్చినవారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం 41శాతం వరకు తగ్గినట్టుగా అధ్యయనంలో తేలింది.

కాళ్ల తొడల ముందు భాగంలో ఉండే కండరాల సముదాయం తాలూకూ బలం… గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని సూచిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ప్రతిరోజు వ్యాయాయం చేయటం వలన ముఖ్యంగా కాళ్లకు శక్తినిచ్చే వ్యాయామాలు చేయటం ద్వారా గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యాయామాల వలన గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్ధ్యం పెరిగి శరీరమంతటా రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

తొడకండరాల బలం పెంచుకోవాలంటే…

గుంజీళ్లు తీయటం, మెట్లు ఎక్కడం, కండరాలను సాగదీయటం, గోడకుర్చీ వేయటం లాంటి వ్యాయామాలతో పాటు… బాక్స్ జంప్స్, లెగ్ ప్రెస్, సుమో స్క్వాట్, స్క్వాట్ జంప్ లాంటి వ్యాయమాలు చేయాలి. ఇవన్నీ కాళ్ల తొడల కండరాలకు బలాన్ని ఇస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

Leg Workouts,Heart Attacks,Health Tips
heart and leg muscle strength, quadriceps and heart attack, heart attacks, Leg workouts, health, health tips, telugu news, telugu global news

https://www.teluguglobal.com//health-life-style/leg-workouts-can-protect-you-from-fatal-heart-attacks-937060