http://www.teluguglobal.com/wp-content/uploads/2016/07/telangana-raya-ravulu-book-1.gif
2016-07-22 09:40:39.0
సమీక్ష: కుటుంబ చరిత్ర మాటున సామాజిక పరిశీలన తెలంగాణా – రాయారావులు : సాంస్కృతిక – సామాజిక వంశ చరిత్ర తెలంగాణా అంటూనే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ‘దొరలు’, వారి పెత్తనం. వారి పాలన. తెలంగాణా సంస్కృతి గురించి మాట్లాడినా, చరిత్ర గురించి మననం చేసుకున్నా మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ‘దొరలు’. తెలంగాణా ప్రజల జీవితాలను ఈ దొరలు ఎంతగా ప్రభావితం చేశారంటే “నీ బాంచన్ కాల్మొక్తా దొర” అన్న మాట తెలంగాణా గ్రామాలలో […]
సమీక్ష:
కుటుంబ చరిత్ర మాటున సామాజిక పరిశీలన
తెలంగాణా – రాయారావులు : సాంస్కృతిక – సామాజిక వంశ చరిత్ర
తెలంగాణా అంటూనే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ‘దొరలు‘, వారి పెత్తనం. వారి పాలన. తెలంగాణా సంస్కృతి గురించి మాట్లాడినా, చరిత్ర గురించి మననం చేసుకున్నా మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ‘దొరలు‘. తెలంగాణా ప్రజల జీవితాలను ఈ దొరలు ఎంతగా ప్రభావితం చేశారంటే “నీ బాంచన్ కాల్మొక్తా దొర“ అన్న మాట తెలంగాణా గ్రామాలలో బడుగు వర్గాల ప్రజల నాల్కలపైన నేటికీ నాట్యమాడుతూనే ఉంది. తెలంగాణా సంస్కృతి పైన , సమాజం పైన దొరల ప్రభావం ఎంతగా ఉండేదో మనందరికీ తెలిసిన విషయమే , కానీ వారి జీవన విధానం గురించి మనకు అవగాహన ఏమాత్రం లేదన్న విషయం సత్యం. ప్రొఫెసర్ రాయారావు రాంమోహన్ రావుగారు తమ వంశ మూలాలను వెతికి వెలికి తీసే ప్రయత్నంలో రచించిన ‘తెలంగాణా – రాయారావులు : సాంస్కృతిక – సామాజిక వంశ చరిత్ర‘ అన్న ఈ పుస్తకంలో దొరల జీవన విధానాన్ని మన కళ్ళకు కట్టినట్లు చూపించారు. అంతేకాదు నాటి సామాజిక జీవన విధానాన్ని వివిధ కోణాలలో స్పృశించారు.
ఈ పుస్తకంలోని ప్రధమాంకంలో వైదిక, నియోగ తెగలు అందులోని ఉపతెగల గురించి, ‘కొణకనాస్థ‘, ‘దేశస్థ‘ బ్రాహ్మణ తెగల మధ్య అధికారం కోసం సాగిన అంతర్గత పోరు గురించి రచయిత వివరించిన తీరుకూడా బాగుంది.
ఇక కోస్తాంధ్రా ప్రాంతంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించే ‘చౌదరీ‘ అన్నది ఒక కులం కాదని, అది వారి పూర్వీకులు నిర్వహించిన వృత్తి అన్న విషయం స్పష్టం చేసిన తీరు బాగుంది. చాలా కులాల పేర్లు వృత్తుల బట్టే స్థిరపడ్డాయని చెప్పడానికి ఇది ఒక ఉదారణ. ఈ సందర్భంగా రచయిత ఈ పుస్తకంలోని మరో అంకంలో గడీల గురించి చెప్పెసమయంలో ఒక్కో కులం వారికి గడీలో ఒక్కో రకమైన పని కేటాయించిన తీరుకు సంబంధించిన వివరణ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.
తెలంగాణా ప్రాంతంలో దొరల చరిత్రలో గడీలకు ప్రత్యక స్థానం ఉంది. గడీల నిర్మాణం వాటి నిర్వహణ గురించి ఆసక్తికరమైన వివరాలు ఈ పుస్తకంలో మనకు కన్పిస్తాయి. ఆ వివరాలు చదువుతుంటే గడీలు చిన్న సైజు కోటలను తలపించేలా ఉండేవని అనిపిస్తోంది. హవేలీలు, భౌతిక నిర్మాణం, , సామాజిక స్వరూపం గురించి చదువుతుంటే, రచయిత వెంట ఆ గడీల్లో తిరిగి చూస్తున్న అనుభూతి పాఠకులకు కలుగుతుంది. దొరల కుటుంబాలలో అమలులో ఉండిన పితృస్వామ్య వ్యవస్థను కూడా రచయిత చక్కగా వివరించారు. (ఒక దేశముఖ్ గారితో – ఆయన జీవించి ఉన్నపుడు – నాకున్న పరిచయంతో వారి కుటుంబంలో మొన్న మొన్నటి వరకు పితృస్వామ్య వ్యవస్థ అమలు తీరు నేను చూశాను) అయితే ఇదే సమయంలో నాటి మహిళల సాహసాన్ని కూడా – దొరసాని చెన్నమ్మ చరిత్ర ద్వారా – రచయిత మనకు తెలియజేయడం విశేషం. దొరసాని చెన్నమ్మ సాయుధ బందిపోట్లను ఒంటరిగా ఎదిరించి, తమ ఖజానాను కాపాడుకున్న విధానం, ఆ పోరాటంలో ఆమె చేతిని పోగుట్టుకున్న తీరు ఒళ్ళు గగుర్పోడిచే విధంగా ఉంది.
ఇక కుతుబ్ షాహీల కాలం నాటి భాష, సంస్కృతీ, కార్యాలయాలలో నాడు పర్షియన్–ఉర్దూ–తెలుగు భాషల కలయికతో కూడిన భాషను ఉపయోగించిన తీరును రచయిత మన కళ్ళకు కట్టినట్లు వివరించారు. కుతుబ్ షాహీల సంస్థానంలో రాయారావులు కీలక పదవులు పొందిన తీరు నాటి మత సామరస్యానికి అద్దంపడుతోంది. జమీన్దారీల రద్దు, రైత్వారీ పధ్ధతి, ఆ చట్టాలలోని లొసుగుల ఆధారంగా నాడు దొరలు ఎలా లాభ పడ్డారో, మరి కొన్ని వర్గాల వారు భూస్వాములుగా మారిన తీరు రచయిత చక్కగావివరించారు.
కథనం, కూర్పు, భాషా సంవిధానం బాగున్నాయి. మొత్తం మీద తెలంగాణా దొరల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో చదవాలనుకున్నా లేదా చారిత్రక గ్రంధంగా చదవాలనుకున్నా లేదా ఎంఫిల్, పిహెచ్ డి చేసే వారు తమ పరిశోధనల్లో భాగంగా చదవాలనుకున్నా లేదా చేతిలో ఎదో పుస్తకం ఉందికదా అని టైం పాస్ కోసం చదవాలనుకున్నా – మొత్తం మీద విడవకుండా చదివించే పుస్తకం. కాకాపోతే పుస్తకం వెల కొంచెం ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది. ముద్రించిన ప్రతుల సంఖ్య పెంచి ఉంటె వెల తగ్గించే అవకాశం ఉండేది.
– ఎస్సెస్వి కుమార్
సామాజిక శాస్త్రవేత్త
హైదరాబాద్
r.v.rama rao,telangana raya ravulu book
https://www.teluguglobal.com//2016/07/22/telangana-raya-ravulu-book/