కూటమి ప్రభుత్వం బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదు

2025-02-28 09:12:19.0

గత ప్రభుత్వాన్ని తిట్టడం, చంద్రబాబు, లోకేశ్‌ను పొగడటం తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదన్న బొత్స

https://www.teluguglobal.com/h-upload/2025/02/28/1407441-botsa-satyanarayana.webp

బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైపీసీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బైట మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారు. అన్నివర్గాల ప్రజల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్నివర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం మాత్రం రూ. 300 కోట్లే పెట్టిందని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆత్మ స్తుతి, పరనిందగానే బడ్జెట్‌ సాగిందన్నారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం, చంద్రబాబు, లోకేశ్‌ను పొగడటం తప్ప ఏమీ లేదన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో అరకొరగా ఒకటి రెండు తప్పా ఏమీ చేయలేదన్నారు. షూరిటీ కాదు.. ప్రజల మోసం అనాలి. మహిళలకు 15 వందలు, విద్యార్థులకు 15 వేలు, రైతుకు 20 వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయి. 81 లక్షల మంది విద్యార్థులుంటే 12 వేల కోట్లు కావాలి. కానీ కేటాయింపులు 9,400 కోట్లు కేటాయించారు. మిగిలినవి ఏ విధంగా ఇస్తారు? ఎక్కడి నుంచి సేకరిస్తారో చెప్పలేదన్నారు. 50 లక్షల మందికి గత ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చామని బొత్స పేర్కొన్నారు.