కెనడాలో ఉన్నత విద్య ఇకపై మరింత భారం

2023-12-09 03:11:09.0

ఫస్టియర్‌ ట్యూషన్‌ ఫీజు, ప్రయాణ ఖర్చులకు ఇది అదనం. 2024 జనవరి 1 తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ మార్పు వర్తిస్తుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

కెనడాలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం విధించిన నిబంధనలు ఆర్థిక భారాన్ని పెంచనున్నాయి. తమ దేశంలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వచ్చే ఇతర దేశాల విద్యార్థులకు స్టూడెంట్‌ డిపాజిట్‌ను రెట్టింపు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రస్తుతం ఈ డిపాజిట్‌ 10 వేల డాలర్లు ఉండగా, దానిని 20,635 డాలర్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. 2024 జనవరి 1వ‌తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది.

కెనడాలో ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన జీవన వ్యయం డిపాజిట్‌ను అక్కడి ప్రభుత్వం కొన్నేళ్లుగా మార్చలేదు. స్టూడెంట్‌ క్యాడ్‌ కింద నివాస, వసతి కోసం ఒక్కో దరఖాస్తు దారుడు 10 వేల డాలర్లు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. కాలక్రమేణా జీవన వ్యయం పెరగడంతో విద్యార్థులు ఇక్కడకు చేరుకున్న తర్వాత అవి సరిపోవడం లేదని కెనడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీటి కోసం స్టూడెంట్‌ డిపాజిట్‌ సొమ్ము 20,635 డాలర్లుగా మార్చుతూ నిర్ణయించింది.

ఫస్టియర్‌ ట్యూషన్‌ ఫీజు, ప్రయాణ ఖర్చులకు ఇది అదనం. 2024 జనవరి 1 తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ మార్పు వర్తిస్తుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ప్రోగ్రాంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు ఈ ఏడాది అక్టోబర్‌ 27న వెల్లడించిన కెనడా ప్రభుత్వం.. తాజాగా ఈ నిర్ణయం వెల్లడించింది. కెనడాలో జీవన వ్యయం విషయంలో అంతర్జాతీయ విద్యార్థులు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారని, అందుకే జీవన వ్యయ పరిమితిని సవరిస్తున్నామని ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

Canada,Raises,Cost Of Living,Requirements,International Students