https://www.teluguglobal.com/h-upload/2022/09/08/500x300_393137-captain-review.webp
2022-09-08 10:06:12.0
‘సార్పట్ట’ అనే పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్ గా నటించి విజయం సాధించిన ఆర్య, ఇప్పుడు ఆర్మీ కెప్టెన్ గా ఇంకో అడ్వెంచర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
చిత్రం : కెప్టెన్
రచన – దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్
తారాగణం : ఆర్య, ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, కావ్యా శెట్టి, హరీష్ ఉత్తమన్, ఆదిత్యా మీనన్ తదితరులు
సంగీతం : డి. ఇమాన్ ఛాయాగ్రహణం : ఎస్. యువ
బ్యానర్స్ : షో పీపుల్, థింక్ స్టూడియోస్, రెడ్ జెయింట్ మూవీస్
పంపిణీ (తెలుగు) : శ్రేష్ఠ్ మూవీస్
విడుదల : సెప్టెంబర్ 8, 2022
రేటింగ్ : 2/5
‘సార్పట్ట’ అనే పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్ గా నటించి విజయం సాధించిన ఆర్య, ఇప్పుడు ఆర్మీ కెప్టెన్ గా ఇంకో అడ్వెంచర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బడ్జెట్ లేకపోయినా నిర్మాణ విలువలతో హాలీవుడ్ ని బీట్ చేసేందుకు ప్రయత్నించాడు. దీనికి దర్శకుడు శక్తి సౌందర్ రాజన్. ఇతను రెగ్యులర్ సినిమాలు కాకుండా ప్రయోగాలు చేస్తాడని పేరుంది. ఇప్పుడా ప్రయోగాభిలాషని సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మీదికి మళ్ళించాడు. అడవుల నేపథ్యంలో సైనిక ఆపరేషన్ తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలనుకున్నాడు. దీనికి ఎంచుకున్న కథేమిటి? ఆ ఆపరేషన్ ఏమిటి? అందులో కొత్తదనమేమిటి? ఆర్యకిది మరో హిట్టేనా? ఇవి తెలుసుకుందాం…
కథ
1960 ల నుంచీ ఈశాన్య అడవుల్లోని సెక్టార్ 42 లో పౌర, సైనిక కదలికలు లేకపోవడాన్ని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని, కారణాలు కనుగొనమని కెప్టెన్ విజయ కుమార్ (ఆర్య) బృందాన్ని ఆదేశిస్తుంది. కెప్టెన్ విజయ కుమార్ బృందంతో ఆ అటవీ ప్రాంతానికెళ్ళి శోధిస్తే, ఇక్కడేదో గ్రహాంతర జీవి ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలో వుంచుకుని విధ్వంసాలు సృష్టిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన ఏ బృందం కూడా ప్రాణాలతో వెళ్ళిన దాఖలా లేదు. ఆ జీవి ఏది? ఎలా వుంటుంది? దాన్ని పట్టుకోవడమెలా? ప్రాణాలు పణంగా పెట్టి దాన్ని అంతమొందించగలరా? ఇవీ కెప్టెన్ విజయ కుమార్ ముందున్న సవాళ్ళు. ఈ సవాళ్ళకి సమాధానమే మిగతా కథ.
ఎలావుంది కథ
దీన్ని హాలీవుడ్ ‘ప్రిడేటర్’ ఆధారంగా తీశామని ముందే చెప్పేశారు. 1987 లో ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ పెద్ద హిట్టయ్యింది. తర్వాత నేటి 2022 వరకూ దీని సీక్వెల్స్ 5 తీశారు. దీన్ని బట్టి 1987 లో ‘ప్రిడేటర్’ మొదటి మూవీ ఎంత పాపులరో అర్ధం జేసుకోవచ్చు. సిల్వెస్టర్ స్టాలోన్ స్పోర్ట్స్ డ్రామా ‘రాకీ 4’ లో కూడా నటించాక, ఇక ‘రాకీ 5’ లో నటించాలంటే గ్రహాంతర జీవులు తప్ప ప్రత్యర్ధులు మిగల్లేదని జోకేశాడు. ఈ జోకు పట్టుకుని గ్రహాంతర జీవితో ‘ప్రిడేటర్’ తీసి పారేశాడు దర్శకుడు జాన్ టీర్నన్. చరిత్ర సృష్టించాడు.
దీన్ని ‘కెప్టెన్’ గా తీస్తూ జోకులా మార్చేశాడు ఇప్పుడు దర్శకుడు శక్తి సౌందర్ రాజన్. కథలో శక్తి లేదు, సౌందర్యం లేదు, రాజసమూ లేదు. ఏమీ లేని దానికి 1960 నుంచీ ఈ అడవుల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది ఈశాన్యంలో. కథ మన దాకా రాకుండా ఆగ్నేయంలో అస్తమిస్తుంది. మనం తూర్పు పడమరల వైపు చూస్తూంటాం- సహజ గుణంతో ఉదయించే కథ కోసం, అస్తమించే కథ కోసం.
ఇంకోటేమిటంటే, ‘ప్రిడేటర్’ తెలుగు తమిళ హిందీ డబ్బింగులు ఎప్పుడో చూసేశారు ప్రేక్షకులు. యూట్యూబ్ లో ఎప్పుడూ అందుబాటులో వుంటుంది. ‘ప్రిడేటర్’ యూఎస్పీ ఏమిటంటే, ఇందులో హార్రర్ ఎలిమెంట్ ప్రధానంగా వుంటుంది. కనపడని గ్రహాంతర జీవి సృష్టించే హార్రర్ బీభత్సం. టీములో ఒక్కొక్కర్నీ కనపడకుండా చంపడం. చివరికి స్వార్జ్ నెగ్గర్ దాంతో ప్రత్యక్షంగా తలపడ్డాక ముగింపు అనూహ్యంగా వుంటుంది. హార్రర్, సస్పెన్స్, థ్రిల్, టెంపో, అడ్వెంచర్, యాక్షన్, హ్యూమన్ డ్రామా, హ్యూమన్ స్పిరిట్ ఇవన్నీ ‘ప్రిడేటర్’ ని సజీవం చేశాయి.
‘కెప్టెన్’ లో వీటితో కూడిన కథనమే లేదు. యాక్షన్ సీన్స్ తప్ప, థ్రిల్ సస్పెన్స్ లాంటివేమీ లేవు. హార్రర్ ఎలిమెంట్ అసలే లేదు. పూర్తిగా ఫ్లాట్ గా సాగి ఫ్లాప్ గా మిగిలిన కథ.
నటనలు -సాంకేతికాలు
ఆర్య ఏ పాత్ర నటించినా నటనలో లోటు లేకుండా చూసుకునే నిబద్ధత గల హీరో. కెప్టెన్ పాత్రని కూడా అలాగే నటించాడు. నటనతో సినిమాని వీలైనంత లేపడానికి ప్రయత్నించాడు. కానీ సినిమా డొల్లగా వుంటే ఏం చేయగలడు. పాత్ర కోసం అతను చేసిన వర్కౌట్స్, బాడీ బిల్డింగ్ చూసైనా, దర్శకుడు కథతో వర్కౌట్స్, బాడీ బిల్డింగులు చేసుకోలేదు.
హీరోయిన్ ఐశ్వర్యతో ఆర్య కెమిస్ట్రీ, బాండింగ్ డీసెంట్‌గా వున్నాయి. ఐశ్వర కూడా ప్రేక్షకులకి కావాల్సిన గ్లామర్ పోషణ బాగా చేసింది. మిలిటరీ పాత్రల్లో హరీష్ ఉత్తమన్, ఆదిత్యా మీనన్ లు ఓకే. డాక్టర్ గా సిమ్రాన్ కూడా ఫర్వాలేదు. ఇంకా సహాయ పాత్రల్లో నటీనటులంతా శక్తి వంచన లేకుండా నటించారు.
ఇమాన్ అందించిన సంగీతం అటవీ నేపథ్య వాతావరణానికి సరిగ్గా సరిపోయింది. అయితే దృశ్యాల్లో పైన చెప్పుకున్న రస పోషల్లేక పోవడంతో, ఆర్యన్ నటన లాగే, ఇమాన్ సంగీతం సినిమాని లేపలేక పోయింది. యువ అనే అతను సమకూర్చిన ఛాయాగ్ర హణానికి బడ్జెట్ పరిమితులు అడ్డు వచ్చాయి. ఛాయాగ్రహణం పేలవంగా వుంది. అంతే కాదు, విజువల్ ఎఫెక్ట్స్, సీజీ కూడా బలహీనంగా బీ గ్రేడ్ మూవీ అన్నట్టు వున్నాయి. ఆర్య వంటి పేరున్న స్టార్ సినిమాకి బడ్జెట్ లేకపోవడమేమిటో.దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ తగిన బడ్జెట్ లేకపోయినా, కథాబలం కోసం కృషి చేసివుంటే ఇంత వృధాగా పోయేది కాదు ప్రయత్నం.
Captain Movie,captain,Captain Movie Review,Captain Movie Rating
Captain, Captain review, Captain Movie Review, Arya, Shakti Soundar Rajan, Simran, Aishwarya Lekshmi, D Imman, Captain rating, Captain trailer, Captain release date, telugu, Captain Movie Telugu Review, Captain Telugu Review, telugu cinema, telugu cinema reviews, కెప్టెన్, కెప్టెన్ రివ్యూ
https://www.teluguglobal.com//cinema-and-entertainment/movie-reviews/captain-movie-review-and-rating-340302