కొండ చరియలు విరిగిపడి.. 100 మందికి పైగా మృతి

2024-05-24 08:39:21.0

ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. శిథిలాల కింద నలిగిపోయిన వారి కోసం గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

పసిఫిక్‌ దేశం పపువా న్యూ గినియాలో ప్రకృతి విపత్తు సంభవించింది. మారుమూల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా మరణించారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవాకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్‌ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్‌లోని కావోకలం గ్రామంలో ఈ విపత్తు సంభవించింది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగి గ్రామంపై పడ్డాయి. దీంతో గ్రామం మొత్తం ధ్వంసమైంది. చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి.

నిద్రలో ఉండగానే అనంత లోకాలకు..

ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. శిథిలాల కింద నలిగిపోయిన వారి కోసం గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అనేక ఇళ్లు పూర్తిగా నేలమట్టమై బండరాళ్లు, చెట్ల కింద కూరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటివరకు 100కు పైగా మృతదేహాలను వెలికి తీశామని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలిపారు. ఇంత ఘోర ప్రమాదం జరిగినా గ్రామానికి పోలీసులు, సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదు. వాళ్లు రెస్క్యూ ఆప‌రేష‌న్‌ మొదలుపెడితే మరిన్ని డెడ్‌ బాడీలు బయటపడే అవకాశం ఉంది.

100 people,killed,landslide,Papua New Guinea