https://www.teluguglobal.com/h-upload/2024/10/03/500x300_1365544-minster-konda.webp
కేటీఆర్‌ను టార్గెట్ చేయబోయి సినీ ప్రముఖులపై మంత్రి సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
2024-10-03 03:31:04.0
‘వాస్తవాలను అంగీకరించకపోవడం మూర్ఖత్వం.. వాస్తవాలను సూటిగా ఎదుర్కొనకపోతే ఆ వాస్తవాలే తిరగబడి ప్రతీకారం తీర్చుకుంటాయి’ -సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్న మాటలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెక్టుగా సరిపోతాయి. ఎన్నికల హామీల అమలు విషయంలో, హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు సీరియస్ కావడం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అటు ప్రజల ముందు, ఇటు కోర్టు ముందు నిలబడింది. బాధ్యతాయుత ప్రభుత్వమైతే లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. మాది ప్రజాప్రభుత్వమని మాటల్లోనే కాదు చేతల్లోనే చూపెట్టాలి. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి వంద అబద్ధాలు ఆడినట్లు రేవంత్ ప్రభుత్వం తప్పుమీద తప్పు చేస్తున్నది. ప్రజాప్రతినిధులు, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నది. వాదనలో విషయం లేనప్పుడు, ఆత్మరక్షణలో ఉన్నప్పుడే ఎదురుదాడి చేస్తారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సరేఖపై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. దీన్ని అందరూ ఖండించారు. బీఆర్ఎస్ కూడా దీనిపై స్పందించి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా.. చివరికి తమ పార్టీకి చెందిన వారు చేసినా ఉపేక్షించేది లేని కరాఖండిగా చెప్పారు. మంత్రి సురేఖపై సోషల్ మీడియాలో కొందరు చేసిన ట్రోల్స్‌పై మొన్నటిదాకా పార్టీలకు అతీతంగా అందరూ సానుభూతి చూపారు. కానీ నిన్న ఆ విషయాన్ని వదిలేశారు. మూసీ బాధితుల వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించడమే కాదు పార్టీ పరంగా అండగా ఉంటామని కేటీఆర్ సహా ఆపార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రిపైనే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులు కూడా ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. తనపై విమర్శలు చేసినా మంత్రులెవరూ స్పందించడం లేదని సీఎం వాపోయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చి ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని మంత్రి అనుకున్నారు. రాజకీయ ప్రత్యర్థిగా కేటీఆర్‌పై విమర్శలు చేయవచ్చు. కానీ సహనం కోల్పోయిన మంత్రి కేటీఆర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. సినీ కుటుంబాలను వివాదంలోకి లాగారు. సంచలనం కోసం ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె మెడకే చుట్టుకున్నాయి.
దీనిపై నాగార్జున, ప్రకాశ్ రాజ్, సమంత కూడా స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సిని ప్రముఖుల జీవితాలను మీ రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి వాడుకోకండని కౌంటర్ ఇచ్చారు. వారి కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అబద్ధం అని స్పష్టం చేశారు. ప్రకాశ్‌రాజ్ కూడా సిగ్గులేని రాజకీయాలు…సినిమాల్లో నటించే మహిళలు అంటే చిన్నచూపా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. సమంత కూడా విడాకులు తన వ్యక్తిగతమని, పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, రాజకీయ ప్రమేయం లేదన్నారు. మంత్రిగా మీ మాటలకు విలువ ఉంటుందని గ్రహించాలని .. తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? అని అభ్యర్థించారు. అమల కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆమె వ్యాఖ్యలు సిగ్గుచేటని.. రాహుల్ గాంధీ.. మీరు గౌరవ మర్యాదలను నమ్మినట్లయితే దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి అని ట్వీట్ చేశారు. మహిళా మంత్రిగా మహిళలకు భరోసా కల్పించాల్సిన ఆమెనే రాజకీయాల కోసం మహిళల పేర్లను తీసుకురావడం విమర్శలకు దారితీస్తున్నది. కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ఆధారాలు లేని వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా మనస్తాపానికి గురైతే వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాల్సి వచ్చింది.
మొత్తానికి మంత్రి కొండా సురేఖ వ్యవహారం కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊసిపోయిన చందంగా మారింది. యథాతథారాజా తథా ప్రజా అన్నట్లు కవితకు బెయిల్ విషయంలో సీఎం సుప్రీంకోర్టు తీర్పు, జడ్జీలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీంతో ఆయనపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణలు చెప్పారు.కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం క్షమాపణలు చెప్పడం సీఎం, మంత్రులకు పరిపాటిగా మారింది. అంతేకాదు బుల్డోజర్ రాజ్, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులుపై వాళ్ల పార్టీ జాతీయ నాయకత్వం వైఖరి ఒకలా ఉంటే రాష్ట్రంలో మాత్రం రేవంత్ సర్కార్ మేం మాట్లాడిందే రాజ్యాంగం. మా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతామన్నట్టు ఉన్నది. ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహాసం చేస్తూ పది నెలల కాలంలోనే పతనావస్థకు చేరడం సీఎం రేవంత్ అండ్ ఆయన మంత్రుల స్వయంకృతమే!
Minister Konda Surekha,controversy comments,on Naga Chaitanya-Samantha divorce Nagarjuna slams,KTR
Minister Konda Surekha, controversy comments, on Naga Chaitanya-Samantha divorce Nagarjuna slams, KTR
https://www.teluguglobal.com//editors-choice/if-medicine-is-applied-to-the-tongue-of-konda-1069451