కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం

2025-01-13 15:02:51.0

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారని మండిపడిన కేటీఆర్‌

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు. పూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు ఓ అలవాటుగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతురుణమాఫీని ఎగ్గొట్టి, దళితబంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి ఈ అణచివేత చర్యలకు దిగుతున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్య తీసుకోవాల్సిందిపోయి ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా ? అని నిలదీశారు. పోరాటాలే ఊపిరిగా పుట్టిన గులాబీ పార్టీ నేతల ఆత్మస్థయిర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 

MLA Padi Kaushik Reddy Arrest,KTR,Condemn,MLA Sanjay Kumar,Karim Nagar Collectorate,Three Cases,Karim Nagar Police