గవర్నర్‌ పాల్గొన్న కార్యక్రమంలో అపశృతి

https://www.teluguglobal.com/h-upload/2025/01/26/1397887-fire-accident-hussain-sagar.webp

2025-01-26 17:12:27.0

హుస్సేన్‌ సాగర్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఉలిక్కిపడ్డ నగరవాసులు

గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. హుస్సేన్‌ సాగర్‌ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం రాత్రి నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ”భారతమాతకు మహా హారతి” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తవగానే తెలంగాణ టూరిజం శాఖకు చెందిన రెండు బోట్లను బాణాసంచా పేల్చేందుకు హుస్సేన్‌ సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లారు. బాణాసంచా పేల్చుతున్న క్రమంలో నిప్పురవ్వలు అవే బోట్లపై పడటంతో వాటిలో ఉన్న బాణాసంచా పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండు బోట్లలో టూరిజం సిబ్బందితో పాటు బాణాసంచా పేల్చేందుకు ఏర్పాటు చేసిన ఏడుగురు ఉండగా ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హుటాహుటిన సమీపంలోని హాస్పిటల్‌ కు తరలించారు. ఫైర్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు.