గుండ్రని చతురస్రం

2022-12-22 17:59:40.0

https://www.teluguglobal.com/h-upload/2022/12/23/432378-heart.webp

పరిణతి చెందిన వయస్సో

పరిణమించిన మనస్సో

పరిమళించిన యశస్సో

పరిహరించిన తమస్సో

ప్రజ్వరిల్లిన వెసూవియస్సో …

దీనికి ఎల్లలు లేవు

ఎత్తులూ లేవు

పల్లాలూ లేవు

దిక్కులూ లేవు

అయినా పిక్కటిల్లుతూ ఉంటుంది

కొలవడానికి వ్యాసమూ లేదు

పొడవు వెడల్పులూ లేవు

ఏది “పై” ది

ఏది కిందిదీ

ఏది పక్కదీ

ఏది ముందుదీ

ఏది వెనుకదీ

తెలీదు … తెలుసుకునే అవకాశమూ లేదు

అయినా దీనికీ వైశాల్యముంది

ఆర్ద్రత నిండిన

హృదయమంత

ఆతృత తో కూడిన

కాలమంత

ఆవేశం కొలవలేని

దూరమంత …

నీ చెక్కిళ్ళూ … నా ఎక్కిళ్ళూ

తెగని దారం … చేరని తీరం

తగ్గని కారం… కట్టని హారం

తీరని భారం … తిరగని వారం

అని భావకవిత్వం రాయడం

నాకు రాదు

అయినా కొలుస్తునే ఉంటా

నిన్ను … నీ అందాన్ని

నీ వ్యక్తిత్వాన్ని … నీ స్నేహ మాధుర్యాన్ని

నీ జీవన సాహచర్యాన్ని

నీ ప్రశాంతతని

నీ చిరునవ్వునీ

నీ దయనీ … నీ ఆలంబననీ

నావైన … నావే అయిన

నీ అన్నిటినీ …

ఎప్పడూ సాంత్వననిచ్చే

నీ ప్రేమనీ …

ఎందుకో తెలుసా …

అది

ఎ స్క్వేర్ పెగ్ ఇన్ ఎ రౌండ్ హోల్

కనుక

గుండ్రని చతురస్రం కనుక

– సాయి శేఖర్

Sai Sekhar,Telugu Kavithalu