2025-01-01 15:50:55.0
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలోని గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లు, స్కూళ్లను పర్యవేక్షించే బాధ్యతలను అడిషనల్ కలెక్టర్లు (లోకల్ బాడీస్) కు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన మొదటి జీవో ఇదే. గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ స్కూళ్లలో వడ్డిస్తున్న భోజనంలో నాణ్యత లేకపోవడం, మౌలిక సదుపాయాల లేమి, ఇతర కారణాలతో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటళ్లలో చేరుకున్నారు. కొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆయా విద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాలికల గురుకులాల పర్యవేక్షణ బాధ్యతను ఆల్ ఇండియా సర్వీసెస్ మహిళా అధికారికి అప్పగిస్తూ మెమో జారీ చేసింది. అడిషనల్ కలెక్టర్లు హాస్టళ్లు, గురుకులాలు, స్కూళ్లను పర్యవేక్షిస్తూ ప్రతి నెల మౌలిక వసతులు, క్లాస్ రూమ్స్, డార్మెటరీలు, శానిటేషన్, భోజనం, ఇతర సదుపాయాలపై కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ప్రతి 15 రోజులకోసారి విద్యాసంస్థలను పరిశీలించడంతో రాత్రి అక్కడే బస చేయాలని ఆదేశించింది.
Residential Schools,Welfare Hostels,Schools,Mid Day Meals,Food Poison,Additional Collectors