గురుగ్రామ్‌లో బాంబు పేలుడు మా పనే

2024-12-12 06:34:27.0

ఇది చిన్న పేలుడేనని ఈజీగా తీసుకోవద్దని, భారీ పేలుళ్లు చేయగల సామర్థ్యం తమకు ఉన్నదంటూ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపు

https://www.teluguglobal.com/h-upload/2024/12/12/1385169-bishnoi.webp

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత సిద్ధిఖీ హత్య తర్వాత లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నది. ఈ సమయంలోనే కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఇటీవల హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకున్న నాటుబాంబు పేలుడుకు తామే కారణమని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించుకున్నది.

గురుగ్రామ్‌ సెక్టార్‌ 29లోని ఓ బారు బైట మంగళవారం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ దాడికి సంబంధించి సచిన్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి మరో రెండు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దాడి తామే చేశామని బిష్ణోయ్‌ అనుచరులు రోహిత్‌ గడర్‌, గోల్డీ బ్రార్‌లు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. బార్‌ యజమానికి అక్రమ మార్గాల్లో రూ. కోట్లు సంపాదిస్తున్నారని, పన్నులు ఎగ్గొట్టి దేశానికి నష్టం కలిగిస్తున్నారని అందులో ఆరోపించారు. ఈ సందర్భంగా అందరూ పన్నులు చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. మరోవైపు ఇది చిన్న పేలుడేనని ఈజీగా తీసుకోవద్దని, భారీ పేలుళ్లు చేయగల సామర్థ్యం తమకు ఉన్నదంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు ఈ పోస్ట్‌ దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 14న సల్మాన్‌ ఖాన్‌ ఇంటివద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. దానికి బాధ్యత వహిస్తూ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆ కేసు విచారణలో భాగంగా ముంబయి పోలీసులు అతనిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. అలాగే 2022 లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ కేసులోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అతనిపై దాదాపు 18 కేసులు ఉన్నాయి. మరోవైపు ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) సీనియర్‌ నేత, సల్మాన్‌ ఖాన్‌ స్నేహితుడు బాబా సిద్ధిఖీ ని హత్య చేసింది కూడా తామేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ వెల్లడించింది.

Lawrence Bishnoi’s,Aids claim responsibility. Crude bombs blasts,At Gurugram nightclub