చక్రం

2023-08-26 18:12:54.0

https://www.teluguglobal.com/h-upload/2023/08/26/816240-chakram.webp

తిరిగే చక్రాలన్నీ

ముందుకే వెళ్తాయన్న గ్యారంటీ లేదు.

వాటికి ఉండాల్సింది

చలనం మాత్రమే కాదు

భ్రమణం వాటి నైజం.

మనకు తెలిసి

సృష్టిలో తొలి చక్రం భూగోళమే,

పురోగమనం వల్ల

పలు రుతువులను ఎగరేసింది

మధ్యలో కొంత సోల్గుతుంది గాని

వెంటనే సద్దుకుంటుంది.

చక్రానికి

అస్తిత్వ సార్థకత

దిశను బట్టే సిద్ధిస్తుంది.

అంతు లేని కీకారణ్యంలో

బాణం గుర్తే

దానికి నిర్దేశిక.

కొన్ని చక్రాలు

రమ్యాతి రమ్యాలు.

దూరాలను దారాల్లాగా

నడుముకు చుట్టుకుంటూ

కనువిందు చేస్తూ జారిపోతాయి

వాటి వేగం

రోడ్డుకు చెప్పే ధన్యవాద రాగం.

కొన్ని మొండి పయ్యలు

చిత్తడి నేలలో దిగబడుతున్నా

ధిక్కరించి బయట పడతాయి

అవి పట్టుదలల గట్టి తునకలు.

కొన్ని ఎత్తైన కొండ లెక్కి దిగుతాయి

ధైర్య చక్రా లందాం వాటిని

మన సైనికులకవి వీర చక్రాలు.

చైతన్యమంతా

తమ ప్రయోజనమే అనుకొని

ఇరుసుల త్యాగాన్న్ని విస్మరిస్తే

కృతజ్ఞతాలోకంలో అది దివాళా.

సుదీర్ఘ మానవ ప్రస్థానంలో

ప్రగతికి దోహదం చేసింది

చక్రమే కావచ్చు

కాని కేవలం తిరగడమే దేనికైనా

చరమ గమ్యం కాదు.

అట్లాగైతే

ఆకలితో అలమటించే

బక్క జీవి

కళ్లు తిరిగి పడి పోయాడు చూడండి.

ఇది కూడా తిరగడమే

కాని తిరోగమనానికి పరాకాష్ట.

— డా౹౹ ఎన్. గోపి

Chakram,Dr N Gopi,Telugu Kavithalu