చరిత్ర ను తిరగరాయండి (కవిత)

2023-03-09 08:30:08.0

https://www.teluguglobal.com/h-upload/2023/03/09/726139-sumathi.webp

నవ్యభారత

వనితా శిరోమణులారా …!

భారతమాత ముద్దు బిడ్డ

మణికర్ణిక ప్రతీకలారా.. !

సృష్టికి ప్రతి సృష్టికి మూలాధారం..

మీరే.. మీరే.. !!

పేరుకోసం.. ప్రతిష్ఠ కోసం..

ఉనికి కోసం …

ఉట్టిట్టి ఉత్సాహమహోత్సవాల

సుడిలో పడక…

కాలక్షేప ప్రేక్షకపాత్ర వహించక …

రవి ఉదయించే… అస్తమించే అద్వితీయమైన కాలాన్ని

నిస్తారం, నిర్వీర్యంలో క్రుంగక…

అటో ఇటో ఎటో…

ప్రతిభ, ప్రగతి, పురోగతిపధంలో…

మీరేమిటో

ధాటిగా.. సూటిగా నిరూపించి …

మీసంతకం దేశపటం పై

శిలాక్షరాలతో లిఖించండి …

చిరకాలం గా జరుగుతోన్న

దుశ్శాసన, కీచక పర్వాలు… నిన్నమొన్నటి నిర్భయ,అభయ,

దిశ ఘాతుకాలను…

పునరావృతం కాకుండా…. మనసిరిసంపదలైన

సంతానాన్ని కాపాడండి…

పెనుప్రమాదం పసిగట్టి

పిడికిళ్లు బిగించి..

అచ్చిక బుచ్చిక ఇచ్చకాలకు చెల్లుచీటీ…రాసి,

మానవ మహా సముద్రం ఎదుట నిలువెత్తు ఎవరెస్ట్ శిఖరమై …

తలెత్తుకు నిలబడండి!

ఒంటరి స్త్రీ

ప్రభంజనం సృష్టించడం అసాధ్యం

అసూయ జాడ్యం జయించి

సమిష్టి శక్తితో …

సమర నినాదాలతోప్రతిధ్వనించి శతాబ్దాల తమిస్రంకి…

వీడ్కోలు చెప్పండి…

రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి ధైర్యశౌర్యాలూ,

సావిత్రీ భాయ్ ఫూలే

అనర్ఘ్యఆశయాలూ

కమలహారిస్

మొక్కవోని సంకల్ప ఉక్కు బలంతో… భారతదేశ అభ్యుదయానికి…

స్పూర్తి ప్రదాతలుగా…

పథ ప్రదర్శకులుగా ..

“ఆధునిక మహిళ దేశచరిత్రను తిరగరాస్తూంది” –

గురజాడ సూక్తికి ప్రతీకలుగా ..

వేయిరేకులుగా విరాజిల్లి .

.సరిక్రొత్త నిర్వచనంతో…

మీ సత్తా రుజువు చేసుకోండి…..

 -పత్తి సుమతి

(జీన్ విజన్ లైబ్రరీ ఫర్ న్యూ ఇండియా వ్యవస్థాపకురాలు ,శ్రీ కాకుళం)

Telugu Kavithalu,Patti Sumathi