2023-09-04 11:23:37.0
https://www.teluguglobal.com/h-upload/2023/09/04/819900-chavithi-chandrudu-copy.webp
Interesting Poem
చంద్రుడు తూర్పున ఉదయించడా?
ఏమో … ఇటీవలి దాకా అలానే
అనుకున్నా…
సూర్యుడెళ్ళాక చంద్రుడూ …
ఈయనెళ్ళాక … ఆయనా
రోజూ వీళ్ళ రొటీన్ ఇదే
అనుకున్నా …
కానీ సోషల్ పాఠం శోషొచ్చే దాకా
అర్థం చేసి చెప్పిన నాన్న
మాటలు గుర్తొచ్చాయ్
సూర్యుడూ, చంద్రుడూ
తూర్పున ఉదయించును
పడమటన అస్తమించును అని …
కానీ స్వస్తి శ్రీ చాంద్రమానేన
దుర్ముఖి నామ సంవత్సరే
దక్షిణాయనే వర్ష ఋతూ
భాద్రపద మాసే శుక్ల పక్షే
తదియ … రవి వాసరే
సాయంకాలం ఏడింటికి అయిదు నిమిషాల ముందు చవితి
ప్రవేశం … ఇది
జంబూ ద్వీపే భరత వర్షే
భరత ఖండే … మేరోర్దక్షిణ దిగ్భాగే …
కానీ పడమటి దిక్కున ముందే
ప్రకాశించడం లో ఏంటో తేడా?
నాకర్థం కాదులే …
నేనేమైనా ఖగోళ శాస్త్రజ్జుడినా
పంచ్ డైలాగులు తెలిసిన
పంచాంగ కర్తనా
నా అజ్జానానికి నేనే జోహారు
చెప్పేసుకుంటున్నా …
కలికాలంలో దిన వారాలు వెనుకా
సినిమాలూ, పండుగలూ ముందూ
అమెరికా లో అరుదెంచుతాయ్
మధ్యలో ఉన్న ఐరోపా లో ఇంకోలా
పోన్లే …
ఆకలిగొన్న వాళ్ళెక్కడ పడితే
అక్కడే ఉన్న ఈ భూ గోళం లో
ఏ పండగ ముందొస్తే ఏంటీ
ఎవరి డబ్బులు దండగయితే ఏంటి …
ఇక్కడ మాత్రం
లా అండ్ ఆర్డర్ కాపాడు స్వామీ …
అదే చేత్తో
సిద్ధాంత కేసరులూ, సిద్ధుల గుఱించి
ఎద్దేవా చేసిన
దేవరకొండ బాలగంగాధర తిలక్ నీ
క్షమించెయ్యి నాయనా …
మతాలకతీతంగా మందీ మార్బలం
మధ్య మతాధిపతులూ,
మఠాధిపతులూ,
పీఠాధిపతులూ,
అమ్మలూ, అయ్యలూ
సాధువులూ, సంతులూ, పునీతులూ
అయిపోతున్నారు …
లేక ఆ బిరుదులు
పాస్త్యుమస్ గా పొందుతున్నారు …
అయినా చిత్రం కాకపోతే
నీలాపనిందల కథ మోసుకు తిరిగే
చంద్రుడు ముందే ఎందుకొచ్చాడో?
పోన్లే ఎవరెట్టా పోతే నాకెందుకు …
ఎవరు తూర్పునొస్తే నాకేంటి
ఎవరు పడమటినుంచీ ఉరికొస్తే
నాకేంటి… నా పిచ్చి గానీ
నారసింహ పతంజలి
గోపాత్రుడి కథలో చెప్పలా
భూమి గుండ్రంగానో,
బల్లపరుపుగానో
ఉండదు
పోలీసోడి లాఠీ లా ఉంటుందనీ …
అదే నిజం …
భక్తి తప్పినా … ముక్తి తప్పకుండా
ముక్తి తప్పినా భక్తీ తప్పకుండా
ఓ బొజ్జ గణపయ్యా …
నువ్వూ నేనూ సేం టు సేం
నీకూ బొజ్జ ఉంది – నాకూ బొజ్జ ఉంది
గణానాం త్వా … గణపతిగ్ం హవామహే… కవిం కవీణాం
ఉపమశ్రవస్తవం …
– సాయి శేఖర్
Interesting,Poem,Moon,Occasion,Vinayaka Chavithi