2023-05-07 10:25:51.0
https://www.teluguglobal.com/h-upload/2023/05/07/759255-chapeyi.webp
నిష్కల్మష హృదయకొలనులో
స్వచ్ఛమైన నవ్వుల రేకలతో
విరిసే మనసుపూలతో నిన్నభిషేకించాలనుకున్నా..
ప్రభూ!
నిశీధిని చీల్చే అరుణోదయపు
అందమైన కిరణాలకు విప్పారే
నిజాల నిర్మల సరోజాలతో నిన్నభిషేకించాలనుకున్నా..
ప్రభూ!
అలసత్వపు జడివానకు ఒరిగిపోని చేతనా నందనవనిలో విరిసే
శ్రమజీవన సౌందర్యపు
స్వేద పరిమళాల మనోరంజితాలతో
నిన్నభిషేకించాలనుకున్నా..
ప్రభూ!
సత్యాసత్య బేరీజుల తరాజులో
అసత్యాన్ని జయించే సద్వచనాల
చాంపేయ మాలికల్లో ఒదిగిన
నిత్య మల్లెలతో
నిన్నభిషేకించాలనుకున్నా .. ప్రభూ!
పరామర్శలకు దూరమై
పరాయి పంచల్లో
వడలిన మలిసంధ్య
సజల నయనాల్లో
ఆశారేఖల అనురాగ దీపాల్లా వెలిగే
పున్నాగపూలతో నిన్నభిషేకించాలనుకున్నా ప్రభూ!
-అవధానం అమృతవల్లి ( ప్రొద్దుటూరు)
Avadhanam Amrutavalli,Telugu Kavithalu