http://www.teluguglobal.com/wp-content/uploads/2015/10/chiranjeevi.jpg
తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం. అది చాలా తీవ్రమైన స్థాయిలో కథల కొరత. చివరికి కథలు దొరక్క, కథలో కొత్తదనం ఉండనక్కర్లేదు, చెప్పేవిధానం కొత్తగా ఉంటే చాలు అనే తీర్మానానికి వచ్చేశారు మనవాళ్లు. హీరోయిన్ని విలన్ కూడా ఇష్టపడడం, ఎత్తుకుపోవడం లేదా వెంటాడటం, హీరో కాపాడి తెచ్చుకోవడం అనే పాయింటయితే ఎంతగా అరిగిపోయిందంటే…చెప్పలేము. అయినా మనవాళ్లు దాన్ని వదలడం లేదు. అసలు జీవితంలో ప్రేమ, పెళ్లి, హీరోలు, విలన్లు తప్ప మరొక అంశమే లేనట్టుగా ఉంటున్నాయి మన కథలు. […]
తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం. అది చాలా తీవ్రమైన స్థాయిలో కథల కొరత. చివరికి కథలు దొరక్క, కథలో కొత్తదనం ఉండనక్కర్లేదు, చెప్పేవిధానం కొత్తగా ఉంటే చాలు అనే తీర్మానానికి వచ్చేశారు మనవాళ్లు. హీరోయిన్ని విలన్ కూడా ఇష్టపడడం, ఎత్తుకుపోవడం లేదా వెంటాడటం, హీరో కాపాడి తెచ్చుకోవడం అనే పాయింటయితే ఎంతగా అరిగిపోయిందంటే…చెప్పలేము. అయినా మనవాళ్లు దాన్ని వదలడం లేదు. అసలు జీవితంలో ప్రేమ, పెళ్లి, హీరోలు, విలన్లు తప్ప మరొక అంశమే లేనట్టుగా ఉంటున్నాయి మన కథలు. ఇవి కాకపోతే ఏదోఒకరకంగా కృత్రిమంగా హాస్యాన్ని సృష్టించడం. అందుకే ఒకటిరెండు కథలు కొత్తపాయింట్‌తో వస్తే వాటిని ఏ భాష వాళ్లూ వదలడం లేదు. ఇటీవల దృశ్యం సినిమా విషయంలో అదే చూశాం. అది ఏ భాషలో తీసినా విజయవంతం అయ్యింది.
మనం నివసిస్తున్న సమాజానికి, చూస్తున్న సినిమాకు అసలు సంబంధమే లేదు అన్నట్టుగా కథలు ఉంటున్నాయి. అందుకే సినిమా, సంవత్సరాలు, నెలలు, వారాలు కాదు కదా…ఇంటికి వచ్చి తాళం తీసేవరకు అయినా మన వెంట రావడం లేదు. తెల్లారిలేస్తే పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు… అనే వార్తలు కనబడుతున్నాయి. ఒక పెద్ద హీరోపై విదేశాల్లో ఒక్కపాటని చిత్రీకరించడానికి అయ్యే ఖర్చుతో….ఈ ఆత్మహత్యలకు కారణాలు, వ్యవసాయంలో నష్టాలకు కారణమవుతున్న భిన్న కోణాలు, రైతుల్లోని భయాలు, వారి మనోభావాలు, పరిష్కారాలు లాంటి విషయాలను పరిశోధించి ఓ చిన్న సినిమాగా మలచవచ్చు. ఎన్నో విషయాలను సమాజం ముందు పెట్టవచ్చు.
ఈ మధ్యకాలంలో రెండురోజులకు ఒకసారి ఒత్తిడి, ర్యాంగింగ్ లాంటి సమస్యలతో విద్యార్థుల ఆత్మహత్యలను పేపర్లలో చూస్తున్నాం. కుటుంబ సంబంధాలు విచ్చిన్నమై మానసిక సమస్యలు పెరగటం, ఉన్మాదులు పెరగటం చూస్తున్నాం. ఇవన్నీ మన చుట్టూ ఉంటాయి. మనం చూస్తున్న సినిమాల్లో ఈ సమస్యలు ఎక్కడా కనిపించవు. అలాగే చిన్న వయసులోనే కెరీర్లో రాణిస్తున్నవారు, సమాజసేవ పట్ల ఆకర్షితులు అవుతున్నవారూ కనబడుతున్నారు. వారి కథలూ ఎక్కడా కనిపించడం లేదు.
కోట్లు ఖర్చుపెట్టి, కోట్లలో రెమ్యునరేషన్లు ఇచ్చి సినిమాలు తీసేవారికి ఈ కథలు సరిపోవు. అంతఖర్చుపెట్టి ఈ చిన్నపాయింట్ మీద సినిమా తీయాలా అనిపిస్తుంది. చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకవు, బయ్యర్లు దొరకరు, నష్టాలు వస్తాయి లాంటి సమస్యలను ఏకరువు పెడుతుంటారు. పెద్ద సినిమాలు ఫెయిలయితే ఆ నష్టాలు భారీస్థాయిలో వస్తున్నా భరిస్తున్నారు కదా.
ఓ కొత్త విషయాన్ని (సమాజానికి అది పాతదే…సినిమాకే కొత్తది) కథగా మలచుకుని సినిమా చేయాలంటే ఎంతో సృజనాత్మకత ఉండాలి. పరిశోధన అవసరం. ఇవన్నీ రిస్క్‌తో కూడుకున్న పనులు. నాలుగు ప్రేమ డైలాగులను అటుదిటు, ఇటుదటు మార్చి కొత్త వాళ్లతో సినిమా తీయడం మన చిన్న నిర్మాతలు, దర్శకులకు తేలిగ్గా అనిపిస్తోంది. మన యువతకు అవే కావాలని చెబుతున్నారు. వారికి అవే కావాలంటే…ఆ సినిమాలు ఎందుకు అడ్రస్ లేకుండా పోతున్నాయనేది ఆలోచించుకోవాలి. కొత్తగా సినిమా రంగంలోకి వచ్చి సినిమాలు తీస్తున్నవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఎంతమంది వచ్చినా అందరూ ప్రేమకథలనే తీస్తున్నారు. అవి ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్లిపోతున్నాయో కూడా తెలియడం లేదు. ఈనేపథ్యంలో సమాజంలో సహజంగా ఉన్న కొన్ని అంశాలను చిత్రీకరించిన మారుతికి విమర్శలతో పాటు గుర్తింపూ రావడం మనం గమనించవచ్చు.
సినిమాకు ఖర్చుపెరుగుతున్న కొద్దీ కథ కుచించుకుపోతుంది. సినిమా వ్యయం ఎంతగా పెరుగుతుంటే అంతగా కథలు కరువైపోవడం, టెక్నాలజీ ఎంత పెరుగుతుంటే అంతగా కథలు తగ్గిపోవడం కూడా మనం గమనించవచ్చు. నిజజీవితం నుండి ఎంత దూరంగా పారిపోతుంటే అంతగా కథల కొరత ఏర్పడుతుంది. ఆలోచింపచేసే కథలు సృష్టించే శక్తి లేకపోవడం వల్లనే ప్రేక్షకులను కేవలం అబ్బుర పరుస్తూ సినిమాని విజయవంతం చేసుకోవాలని చూస్తున్నారు. అసలు కథ అంటే ఏంటి…ఇప్పటికీ మాయాబజార్, గుండమ్మకథ, మిస్సమ్మ లాంటి సినిమాలు గొప్పవని చెప్పుకుంటున్నాం.
మాయా బజార్ని టెంత్ క్లాస్ పాఠ్యాంశంగానూ చేర్చారు. కథ మన జీవితాల్లోంచి రావాలా…ఎక్కువ ఖర్చుపెట్టేది అయి ఉండాలా…ఈ విషయం పట్ల మనవాళ్లకు స్పష్టత లేదు. కథ మంచిదే అయినా స్క్రీన్‌ప్లే సరిగ్గా లేకపోతే మెదడు తీసుకోదు…రిజక్ట్ చేస్తుంది. అనగనగా ఒక రాజు కథని శతాబ్దాల వరకు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అందులో మెదడుని మర్చిపోనివ్వని రిథమ్, కథనం ఉన్నాయి. సినిమా దృశ్య ప్రధానమే అయినా అందులో కథ లేకపోతే అర్థ రహితంగా అనిపిస్తుంది. సినిమాకు కోట్లు ఖర్చుపెట్టినా, అందులో నూలుపోగంత కథయినా ఉండి తీరాల్సిందే. వందకోట్ల బడ్జెట్ సినిమా చూసినప్పటి కంటే ఒక చందమామ పుస్తకాన్ని చదివితే మనకు ఎక్కువ ఆనందం కలుగుతున్నప్పుడైనా మనవాళ్లు కథల గురించి మరింత సీరియస్‌గా ఆలోచించాల్సి ఉంది.
సినిమా లైఫ్‌లా ఉండాలా, లార్జర్ దెన్ లైఫ్‌లా ఉండాలా…అనే ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు మన కళ్లముందున్నవన్నీ లార్జర్ దాన్ లైఫ్ చిత్రాలే. అందుకే ప్రేక్షకులు హీరోలతో కలిసి ప్యారిస్, థాయ్‌ల్యాండ్, బ్యాంకాక్ వెళ్లొస్తారు కానీ, హీరోతో కానీ, మరేదైన పాత్రతో గాని కలిసి మానసిక ప్రయాణం చేసే కథలు చాలా తక్కువగా వస్తున్నాయి. మన సినిమా కథలకు పరిమితులు కూడా ఎక్కువే ఉంటున్నాయి. హీరో అగ్రెసివ్‌గా ఉండాలి, సాహసాలు చేయాలి, విలన్లని చితక్కొట్టాలి…లాంటి పరిమితులకు లోబడే కథ ఉండాలి కనుకనే మనకు కథల కొరత మరింతగా ఉంది. వాటిని పక్కన పెట్టి తీసిన సినిమాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తారని సీతమ్మ వాకిట్లో… నిరూపించింది.
కథ అంటే అందులో మన మనసుండాలి లేదా జీవితం ఉండాలి లేదా సామాజిక స్థితి ఉండాలి…కానీ మన మూస కథల్లో ఇవన్నీ పట్టవు. అందుకే మనకు కథలు దొరకవు. నిజంగా సమాజంలోంచి వెతుక్కోవాలంటే…సబ్జక్టులు అనేకం మనకు కనబడతాయి. సినిమా కథలకంటే రసవత్తరమైన రాజకీయ సంఘటనలు, మలుపులు, నాయకుల విదేశీ ప్రయాణాలు, వాగ్దానాలు, విమర్శలు… జనంలో చైతన్యం, పాలకుల అలసత్వం ఇవన్నీ బుల్లితెరమీద ఎంతో నాటకీయంగా కనబడుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి కదా!
చిరంజీవి సినిమాకు ఇప్పటి సామాజిక పరిస్థితులకు తగినట్టుగా రెండు కథలను ఊహిద్దాం… ఈ మధ్య కాలంలో ఐఎస్ ఉగ్రవాదుల దృష్టి మన దేశం మీద ఉందనే వార్తలు, విశ్లేషణలు చాలా వస్తున్నాయి. దీనిపై తగినంత సమాచారం, రీజనబుల్ ఆలోచనా క్రమం ఇప్పటికే మన దగ్గర ఉంది. చిరంజీవి ఇంటర్‌పోల్ అధికారి లేదా పోలీస్ అధికారి గా, మానసిక వైద్యుడిగా డబల్ పాత్రలు పోషించేలా కథని తయారుచేయవచ్చు. దేశ రక్షణ ధ్యేయంతో ఒక పాత్ర, దేశంలోపల యువత భావాలు కలుషితం కాకుండా చూడడం ఒక పాత్ర లక్ష్యంగా కథని అల్లుకోవచ్చు. దేశ హద్దుల గురించి కాదు, మెదడులోపలి హద్దుల గురించి చర్చించవచ్చు.
అలాగే అరుషి, ఇంద్రాణి లాంటి కేసులు కళ్లముందుకొస్తున్న తరుణంలో…ఓ లాఫింగ్ క్లబ్ నిర్వాహకుడి పాత్రని వినూత్నంగా క్రియేట్ చేయవచ్చు. తాత్కాలిక నవ్వులకోసం క్లబ్ నడిపే ఓ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఆ నవ్వులు శాశ్వతంగా సమాజంలో ఉండాలంటే ఏంచేయాలి…అని ఆలోచిస్తే, తన చుట్టూ ఉన్న, ఉన్నత స్థాయి కుటుంబాల్లో తగ్గిపోతున్న మానవ సంబంధాలు, ఈ నేపథ్యంలో జరుగుతున్న ఘోరాలు వీటిని గుర్తించడం, కారణాలు వెతికి, ఒక ప్రశాంతమైన జీవితానికి అవసరమయ్యే అంశాలను ఫిలసాఫికల్ టచ్‌తో చెప్పడం…ఇలా కథను తయారుచేయవచ్చు.
సస్పెన్స్ థ్రిల్లర్ కథగా నాటకీయతను మేళవించవచ్చు. ఈ నేపథ్యంలో హీరోయిజం కూడా ఎలివేట్ అవుతుంది. మనకు సబ్జక్టులు ఉన్నాయి, సృజనాత్మకతే లేదు అని చెప్పడానికే ఈ ఉదాహరణలు. టివి ఛానల్స్ పెరిగిపోయి, ఇంటర్ నెట్ ప్రభంజనం మన జీవితాలపై అత్యంత ప్రభావం చూపుతున్న ఈ దశలో పలురకాల అవినీతి, కుంభకోణాలు, స్ఫూర్తి కథలు, వార్తా కథనాలు, విశ్లేషణలు మనముందుకు వస్తున్నాయి. వీటిలోంచి కథలను తయారుచేసుకుంటే సమాజానికి దగ్గరగానూ ఉంటాయి, కథల కొరతా తీరుతుంది. రుద్రమదేవి అనే కథే తనకు దొరికిన గుప్త నిధి అని ఆ సినిమా నిర్మాత, దర్శకుడు గుణశేఖర్ ప్రకటించారు. ఆయన అన్నది నిజమే. ఇప్పుడు కథలే సినిమాకు అసలైన పెట్టుబడి.
-వడ్లమూడి దుర్గాంబ
Chiranjeevi,Chiranjeevi 150 Movie,Chiranjeevi 150th film Details,Chiranjeevi 150th Film Story,Chiranjeevi 150th film title,Chiranjeevi 150th Movie Director
https://www.teluguglobal.com//2015/10/06/there-are-good-stories-for-chiranjeevi-150-movie/