2016-05-31 05:08:45.0
ఇంతకుముందు ఏ పనులైతే ఆడవాళ్లు చేయలేకపోయారో, మేము చేయలేము…అని అనుకున్నారో…అలాంటి పనులెన్నింటినో ఇప్పుడు వారు చేస్తున్నారు. కొత్త పనికి అవసరమైన కట్టు బొట్టు భాష అలవాట్లు ఆహార్యం లాంటివాటిని సైతం వారు తేలిగ్గా మార్చుకుంటున్నారు. తమిళనాడుకి చెందిన భారతి (37) కొబ్బరి చెట్లను చకచకా ఎక్కేయగ లుగుతుంది. మగవారిలాగే అత్యంత చాకచక్యంగా ఈ పని చేయగలుగుతోంది. వ్యవసాయ కుటుంబంలోనే పుట్టినా భారతికి చిన్నతనంలో చెట్లు ఎక్కటం లాంటివి అలవాటు లేదు. పైగా కొబ్బరి చెట్టుని ఎక్కడం అంటే […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/coconut-tree.gif
ఇంతకుముందు ఏ పనులైతే ఆడవాళ్లు చేయలేకపోయారో, మేము చేయలేము…అని అనుకున్నారో…అలాంటి పనులెన్నింటినో ఇప్పుడు వారు చేస్తున్నారు. కొత్త పనికి అవసరమైన కట్టు బొట్టు భాష అలవాట్లు ఆహార్యం లాంటివాటిని సైతం వారు తేలిగ్గా మార్చుకుంటున్నారు. తమిళనాడుకి చెందిన భారతి (37) కొబ్బరి చెట్లను చకచకా ఎక్కేయగ లుగుతుంది. మగవారిలాగే అత్యంత చాకచక్యంగా ఈ పని చేయగలుగుతోంది.
వ్యవసాయ కుటుంబంలోనే పుట్టినా భారతికి చిన్నతనంలో చెట్లు ఎక్కటం లాంటివి అలవాటు లేదు. పైగా కొబ్బరి చెట్టుని ఎక్కడం అంటే మాటలు కాదు, చాలా నైపుణ్యం కావాలి. కుటుంబానికి మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఆమె కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోయటం నేర్చుకుంది.
భారతికి నాలుగేళ్ల క్రితం భర్త మరణించాడు. దాంతో ఆమెమీద కుటుంబ భారం పడింది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. స్కూల్లో చదువుకుంటున్న తన కూతురు డాక్టరు కావాలని ఆశపడుతోందని, తప్పకుండా కూతురి కోరికని నెరవేరుస్తానని భారతి చెబుతోంది. గ్రామాల్లో మగవారు నగరాలకు వలసలు పోతున్న నేపథ్యంలో భారతికి ఇది ఒక ఉపాధిగా మారింది. చీర అడ్డుపడుతుంది కాబట్టి ఆమె ఈ పనిని నేర్చుకునేందుకు చుడీదార్‌లోకి మారింది. నిటారుగా ఆకాశాన్ని చూస్తున్నట్టున్న కొబ్బరి చెట్లను భారతి రెండు నిముషాల్లో చకచకా ఎక్కేస్తుంది. కాయలు తెంపి కిందకు విసిరి తిరిగి జాగ్రత్తగా దిగిపోతుంది. రోజుకి యాభై చెట్ల వరకు ఎక్కగలనంటోందామె. తనకు ఎత్తుకి వెళ్లినపుడు భయం ఉండదని, కాకపోతే తెనెటీగలు, పురుగులు లేకుండా చూసుకుంటానని భారతి చెబుతోంది. ఆమె ఈ పని నేర్చుకుంటున్నపుడు ఆశ్చర్యపోయిన చాలామంది ఇప్పుడు పిలిచి మరీ తమకు కాయలు కోసిపెట్టమంటూ పని చెబుతున్నారు. మిషను కుట్టి కూతురిని పోషించుకుంటున్న భారతికి కొబ్బరి కాయలు కోయటం అదనపు ఆదాయ వనరుగా మారింది.
coconut trees