జగన్‌తో మాట్లాడిన రఘురామ.. ఏం చెప్పారంటే!

2024-07-22 08:12:48.0

జగన్‌ చెవిలో రఘురామకృష్ణం రాజు ఏదో చెప్పడం కనిపించింది. దీంతో రఘురామకృష్ణం రాజు జగన్‌తో ఏం మాట్లాడాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

https://www.teluguglobal.com/h-upload/2024/07/22/1346197-tdp-mla-raghu-ramakrishna-raju-spoke-to-jagan-in-the-assembly-premises.webp

ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను.. తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామరాజు పలకరించారు. ఉప్పు, నిప్పు వ‌లే ఉన్న వీరిద్దరూ మాట్లాడుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇద్దరూ ఏం చర్చించుకున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు స్వయంగా జగన్‌ దగ్గరికి వెళ్లారు రఘురామకృష్ణంరాజు. ఆయనను పలకరించారు. కొద్ది నిమిషాల పాటు ఇద్దరు ఏదో సంభాషించుకున్నారు. దీంతో వారిద్దరిని అక్కడున్న వారంతా ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలోనే జగన్‌ చెవిలో రఘురామకృష్ణం రాజు ఏదో చెప్పడం కనిపించింది. దీంతో రఘురామకృష్ణం రాజు జగన్‌తో ఏం మాట్లాడాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

2019లో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణంరాజు. తర్వాత జగన్‌తో విబేధించిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ, రఘురామ మధ్య వివాదం పెరుగుతూ వచ్చింది. గతంలో రఘురామకృష్ణంరాజుని సీఐడీ అరెస్టు చేసింది. అయితే తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని, చంపేందుకు ప్రయత్నించారంటూ వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు రఘురామరాజు. RRRపై ఏనాడూ వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేయలేదు జగన్‌. ఇక 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరిన RRR.. ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత తనపై హత్యాయత్నం చేశారని సీఐడీ అధికారులు, అప్పటి సీఎం జగన్‌పై గుంటూరు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఇక కూటమి ప్రభుత్వంలో మంత్రి లేదా స్పీకర్ పదవి దక్కుతుందని RRR ఆశించారు. కానీ, చివరికి ఆయనకు నిరాశే మిగిలింది. ఈరోజు అసెంబ్లీ ప్రాంగ‌ణంలో రఘురామకృష్ణం రాజు – జగన్‌ మధ్య జరిగిన ఎపిసోడ్‌ సంచలనంగా మారింది.