జగన్-కేసీఆర్‌ మధ్య గొడవలకు ప్రయత్నాలా?

2023-06-02 06:05:08.0

అప్రూవర్‌గా మారిన శరత్‌తో కల్వకుంట్ల కవిత పేరు చెప్పించేందుకు జగన్ రెడీ అయ్యారనేది రెబల్ ఎంపీ చెబుతున్నారు. కవితను ఇరికించి రహస్య సాక్షిని బయటపెట్టకుండా కాపాడుకునేందుకు కేసీఆర్‌కు జగన్ ద్రోహం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందని రఘురామ‌రాజు చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌ మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. ఢిల్లీలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ‌రాజు మాటలు విన్న తర్వాత అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల్లో ఒకడైన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిపోయారు. సో, అప్రూవర్‌గా మారిన శరత్ స్కామ్‌లో ఎవరి పాత్ర ఏమిటో ఈడీకి వివరించబోతున్నారు.

శరత్ అప్రూవర్‌గా మారటానికి వివేకానందరెడ్డి హత్యకేసుకు రఘురామ‌రాజు ముడిపెట్టి మాట్లాడారు. ఏ విధంగా అంటే వివేకా హత్యకేసులో రహస్య సాక్షి ఒకళ్ళున్నారని సీబీఐ హైకోర్టులో చెప్పింది. అవసరం వచ్చినపుడు రహస్య సాక్షిని ప్రవేశపెడతామని చెప్పింది. అయితే సీబీఐ చెప్పిన మాట మీద ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే హత్యను కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగయ్య ఇప్పటికే తన వాగ్మూలాన్ని ఇచ్చేశాడు. రంగయ్యకు మించిన ప్రత్యక్ష సాక్షి ఉండరు.

హత్య కేసు దర్యాప్తును తన ఇష్టంవచ్చినట్లు చేస్తున్న సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సందర్భంలోనే రహస్య సాక్షి ఉన్నట్లు సీబీఐ చెప్పింది. ఇప్పుడు ఈ విషయంపైనే రెబల్ ఎంపీ మాట్లాడుతూ.. రహస్య సాక్షి ఎవరో బయటపడకుండా ఉండాలంటే లిక్కర్ స్కామ్‌లో కీలక వ్యక్తులెవరనే విషయాన్ని శరత్ చెప్పేట్లుగా ఒప్పందం జరిగిందట. అంటే నిందితుడైన శరత్ అప్రూవర్‌గా మారటానికి జగన్మోహన్ రెడ్డే కారణమని రఘురామ‌రాజు ఆరోపణ.

అప్రూవర్‌గా మారిన శరత్‌తో కల్వకుంట్ల కవిత పేరు చెప్పించేందుకు జగన్ రెడీ అయ్యారనేది రెబల్ ఎంపీ చెబుతున్నారు. కవితను ఇరికించి రహస్య సాక్షిని బయటపెట్టకుండా కాపాడుకునేందుకు కేసీఆర్‌కు జగన్ ద్రోహం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందని రఘురామ‌రాజు చెప్పారు. ప్రచారం చేసేదీ వీళ్ళే, వార్తలు రాయించేదీ వీళ్ళే, మళ్ళీ ప్రచారం జరుగుతోందని చెప్పేదీ వీళ్ళే. వివేకా కేసులో రహస్య సాక్షి ఉన్నాడని సీబీఐ కమిట్ అయిన తర్వాత బయటపెట్టకపోతే కోర్టు ఊరుకుంటుందా ? అసలు లిక్కర్ స్కామ్‌కు వివేకా హత్యకేసుకు ఏమిటి సంబంధం? ఇదంతా చూస్తుంటే జగన్ – కేసీఆర్‌ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లే అనుమానంగా ఉంది.

 

YS Jagan Mohan Reddy,KCR,YSRCP,BRS,Raghu rama Krishnam Raju