జగన్‌..తీరు మార్చుకో- ప్రొఫెసర్ హరగోపాల్

2022-06-04 06:01:21.0

అమరావతి విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌ తన ఆలోచన మార్చుకోవాలని సూచించారు ప్రొఫెసర్ హరగోపాల్. ”అమరావతిపై హైకోర్టు తీర్పు- సర్కారు తీరు” పేరుతో అమరావతివాదుల ఆధ్వర్యంలో విజయవాడలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రసంగించిన హరగోపాల్… హైకోర్టు సమగ్రంగా పరిశీలించే అమరావతిపై తీర్పు ఇచ్చిందన్నారు. మూడేళ్ల క్రితం బాపట్ల ట్రైనింగ్‌ సెంటర్‌లో కొత్తగా వచ్చిన ఐఏఎస్‌ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడేందుకు వచ్చిన సమయంలో… అమరావతి నిర్మాణాలు పరిశీలించానని గుర్తు చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత వెళ్లి చూస్తే అప్పుడు […]

అమరావతి విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌ తన ఆలోచన మార్చుకోవాలని సూచించారు ప్రొఫెసర్ హరగోపాల్. ”అమరావతిపై హైకోర్టు తీర్పు- సర్కారు తీరు” పేరుతో అమరావతివాదుల ఆధ్వర్యంలో విజయవాడలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రసంగించిన హరగోపాల్… హైకోర్టు సమగ్రంగా పరిశీలించే అమరావతిపై తీర్పు ఇచ్చిందన్నారు. మూడేళ్ల క్రితం బాపట్ల ట్రైనింగ్‌ సెంటర్‌లో కొత్తగా వచ్చిన ఐఏఎస్‌ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడేందుకు వచ్చిన సమయంలో… అమరావతి నిర్మాణాలు పరిశీలించానని గుర్తు చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత వెళ్లి చూస్తే అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే నిర్మాణాలు ఉండిపోయాయన్నారు. ఈ ప్రతిష్టంభన తనకు బాధ కలిగించిందన్నారు.

50శాతం, 70 శాతం పూర్తయిన నిర్మాణాలు కూడా ముందుకెళ్లకుండా ఆగిపోయాయని ఇది సరైన విధానం కాదన్నారు. పార్టీల అధికారం మారవచ్చు గానీ… రాజ్యం,ప్రభుత్వం అన్నది నిరంతర పక్రియ అన్న విషయం గుర్తించుకోవాలన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలు తప్పారైటా అన్నది కాకుండా.. ఆ నిర్ణయాలను గౌరవించడం ఒక నిరంతర పక్రియ అన్న విషయాన్ని జగన్‌మోహన్ రెడ్డి గుర్తించాలన్నారు. పార్టీ మారినప్పుడల్లా విధాన నిర్ణయాలు పూర్తిగా మార్చడం సరికాదన్నారు.

గత ప్రభుత్వం ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెడితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఆపేస్తా అనడం సరైనది అవుతుందా అని ప్రశ్నించారు. కొన్ని నిర్ణయాలను వెనక్కు తీసుకోలేమని వాటిని కొనసాగించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పటికీ రాజధానికి రైతులు భూములు ఇచ్చారని..ఇప్పుడు ఆ నిర్ణయం గౌరవించకపోతే ప్రభుత్వానికి విశ్వనీయత లేకుండా పోతుందన్నారు.

అమరావతి విషయంలో గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయమే చేసింది అనుకున్నా.. ఇప్పుడీ ప్రభుత్వం అంతకంటే పెద్ద పొరపాటు చేస్తోందన్నారు. ప్రతిష్టంభన ఏర్పడింది, మూడు రాజధానులు తేలేకపోయారు… వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే అప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంపై విశ్వసనీయత అన్నది చాలా ముఖ్యమని.. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా తీర్పులను అమలు చేయకపోతే ఇక వ్యవస్థలను ప్రజలే నమ్మే పరిస్థితి ఉండదని..అలాంటి సమాజంలో పాలన చేయడం ప్రభుత్వాలకే కష్టంగా మారుతుందన్నారు. ఒక ప్రభుత్వం వచ్చి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంది, దాంతో ఏపీ అభివృద్ధిలో వెనుకపడిందన్న విధంగా ఈ ఉదంతాన్ని చరిత్ర రికార్డు చేస్తుందని.. దాని వల్ల ఇప్పటి పాలకులకు చరిత్రలో ఖ్యాతి రాదన్నారు. రాజధాని తన వ్యక్తిగత అంశం కాదు.. ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం అని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. మిగిలిన ప్రాంతాల వారు కూడా అమరావతికి మద్దతు ఇచ్చి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండేలా ఆలోచన చేయాలని హరగోపాల్ సూచించారు.

 

‘High Court Judgment on Amravati – Government Style’,Amravati,jaganmohan reddy,Professor Hargopal suggested that Chief Minister Jagan