జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

2024-12-12 10:02:38.0

రేపు లోక్‌సభ ముందుకు బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్‌ జారీ

https://www.teluguglobal.com/h-upload/2024/12/12/1385245-one-nation-one-election.webp

వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ దిశగా ఇంకో అడుగు ముందుకు పడింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో రూపొందించిన సమర్పించిన నివేదికను బిల్లు రూపంలో పార్లమెంట్‌ ఉభయ సభల ముందుకు కేంద్ర ప్రభుత్వం తేబోతుంది. ఈనేపథ్యంలో గురువారం మధ్యాహ్నం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం జమిలి ఎన్నికల ముసాయిదా ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈనెల 13, 14 తేదీల్లో బీజేపీ ఎంపీలందరూ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేశారు. దీంతో శుక్రవారమే లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు రానుందనే చర్చ మొదలైంది. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వామ్యం చేయడానికి జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ఈ బిల్లు పంపుతారు. జేపీసీలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాబోయే కాలంలో రాజ్యసభలోనూ ఈ బిల్లు పెట్టి ఆమోదం పొందాలనే యోచనలో మోదీ సర్కారు ఉంది. దేశంలో పార్లమెంట్‌ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు వంద రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. పార్లమెంట్‌ ఉభయ సభలతో పాటు ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ఆమోదం కూడా పొంది వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వమించాలనే ప్రయత్నాల్లో మోదీ ప్రభుత్వం ఉంది.

One Nation One Election,Union Cabinet,Lok Sabha,wip to BJP MPs