2022-12-08 08:09:44.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/08/430255-jeevitham-ante.webp
పనిమనిషి… పారిజాతం… నగరం.. విశాఖపట్నం…. ఓ కాలనీలో
ఐదు ఇళ్లలో పనిచేస్తుంది. పారి జాతం… ఆరుగంటలకు కాలనీలో
ప్రవేశిస్తుంది. పదకొండున్నరకు ఐదు ఇళ్ల పనిని ముగించి… కాలనీకి
మూడు కిలోమీటర్ల దూరంలో వున్న తన లేబర్ కాలనీకి చేరుతుంది.
ఆమెకు తోడు వృద్ధులైన తండ్రి కోదండం… తల్లి కాంచన.
ఆ కాలనీలో పుట్టి పెరిగినవాడు… సుబ్రహ్మణ్యం… పదేళ్ల క్రిందట
ఓ కట్టడం కూలి పనిచేస్తున్న అతని తల్లిదండ్రులు ఒకేసారి గతించారు.
కోదండం తాపీ మేస్త్రి… సుబ్రహ్మణ్యం అతని శిష్యుడు….
గురువుకు ఎంతో వినయంగా వుండి పని మెలకువలను బాగా
నేర్చుకొన్నాడు. సుబ్రహ్మణ్యం మంచి పనిమంతుడనే పేరును
సంపాదించాడు.
వీరయ్య కొత్తగా శ్రీకాకుళం నుంచి వచ్చిన పనివాళ్లలో ఒకడు.
సుబ్రహ్మణ్యానికి, వీరయ్యకు వయస్సు వ్యత్యాసం మూడేళ్లు.
అక్కడికి వచ్చిన కొత్తల్లో మొగ కూలీగా పనిచేసే వీరయ్య…
సుబ్రహ్మణ్యానికి కాంట్రాక్టర్, భవంతి యజమాని ఇచ్చే గౌరవాన్ని చూచి…
తనూ తాపీ మేస్త్రి కావాలని నిర్ణయించుకొన్నాడు. ఒక తాపీ కొన్నాడు.
సుబ్రహ్మాణ్యానికి దాన్ని చూపించి…
“అన్నా!… నాకు నీవు చేసే పనిని నేర్పవా!…” దీనంగా అడిగాడు
వీరయ్య.
“తాపీని కొన్నావుగా… అంటే నా పనిని నేర్చుకోవాలని నీకు ఆవగా
వుందన్నమాట… నేర్పుతా… నేర్చుకో…” నవ్వుతూ చెప్పాడు సుబ్రహ్మణ్యం.
సంవత్సరంలో ఆపని పూర్తయి పోయింది. అప్పటికి వీరయ్య
తాపీ పనిలో కొంత పాండిత్యాన్ని సాధించాడు.
వీరయ్య తెలివి కలవాడు. అందరినీ అభిమానించేవాడు. పెద్దా
చిన్నలకు సమగౌరవాన్ని ఇచ్చేవాడు. అన్నిటికంటే దైవం మీద అపార
నమ్మకం. భక్తి… సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అతని ఆరాధ్య దైవం. అతని
తత్వాన్ని గ్రహించి… సుబ్రహ్మణ్యం తాపీ పనిలోని మెలకువలను ఎంతో
అభిమానంతో వీరయ్యకు నేర్పాడు.
ఆ కాంట్రాక్టర్ రామారావు మరో బిల్డింగు ప్రారంభించాడు.
సుబ్రహ్మణ్యం వీరయ్యలను అక్కడికి పంపాడు. ఆ ఐదు అంతస్థుల
భవన నిర్మాణం ప్రారంభమయింది.
లేబర్కాలనీలో వుండే కోదండం కూతురు… పారిజాతంతో
సుబ్రహ్మణ్యం వివాహం జరిగింది. వారి వివాహం జరిగి అప్పటికి రెండు
నెలలు… వీరయ్య ఏకాకి కాబట్టి కట్టడం దగ్గర గుడిశలో పడుకొనేవాడు.
ఆదివారం రోజు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి పారిజాతం వంటకాలను
తిని బిల్డింగ్ వద్దకు వచ్చేవాడు.
ఆ రాత్రి తొమ్మిది గంటల వరకు పనిచేసి సుబ్రహ్మణ్యం తన
సైకిల్ మీద లేబర్ కాలనీకి బయలుదేరాడు. కలవారి కుమారులు ఇరువురు… తప్పతాగి బులెట్పై వేగంగా వచ్చి సుబ్రహ్మణ్యం సైకిల్ను ఢీ కొట్టారు. సుబ్రహ్మణ్యం కింద పడిపోయాడు. అతని తలరోడ్డుప్రక్కనవున్న పెద్దబండరాయికి తగిలి పగిలింది. అతని కధ ముగిసిపోయింది.
పెద్దింటి… దొరలు పారిపోయారు.
సుబ్రహ్మణ్యం మరణానికి వీరయ్య, పారిజాతం, ఆమెతల్లిదండ్రులు కాలనీ వాసులు ఎంతగానో బాధపడ్డారు. బిల్డింగ్ కాంట్రాక్టర్
రామారావు ఆ కుటుంబానికి యాబైవేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.పోలీస్ విచారణలో… ఆ ఇరువురు యోధులు రామారావుగారితనయులనితేలింది. విషయం చెవికి రాగానే రామారావు ఇనస్పెక్టరును కలసి కేసునురివర్స్ చేయించి… సుబ్రహ్మణ్యం తాగి సైకిల్ నడుపుతూబండరాయిమీద తూలిపడి రాయి తాకిడికి తల పగిలి చచ్చిపోయాడని…కేసు క్లోజ్ చేయించారు.
వీరయ్య రెండు రోజులకు ఒకసారి కాలనీకి వచ్చి పారిజాతాన్ని…
ఆమె వృద్ధ తల్లిదండ్రులను వారికి కావాల్సినవి కొనిచ్చి వెళుతూ
వుండేవాడు.
పారిజాతానికి నెలలు నిండాయి. వీరయ్య హాస్పిటల్లోచేర్పించాడు. రెండవరోజున పారిజాతం ఆడపిల్లను కన్నది. సుఖ ప్రసవం.మూడవరోజు ఇంటికి పంపేశారు.
అది మొదలుకొని… వీరయ్య ప్రతిరోజు పారిజాతం ఇంటికి సాయంత్రం వచ్చి… పెద్దవారికి… పాపకు కావాల్సినవాటిని అమర్చి బిల్డింగ్ దగ్గరకు వెళ్లేవాడు.
ఆరునెలలు గడిచాయి. ప్రస్తుతంలో వీరయ్య… రామారావుకు
అతి ముఖ్యుడు. ఆ భవన నిర్మాణానికి హెడ్ తాపీ మేస్త్రీ… పారిజాతం ఇంటికి తరచుగా వచ్చివెళ్తున్న వీరయ్యను చూచి కాలనీ కాకులు కొత్త కథనాన్ని అల్లారు. పారిజాతానికి వీరయ్యకు సంబంధం అని నిర్ణయించారు. ఆ వార్త పారిజాతం చెవికి సోకింది. ఇంటికి వచ్చినవీరయ్యతో “ఇక మీదట మా ఇంటికి రాకు…” ఆవేశంతో చెప్పింది పారిజాతం…
“నేనేం తప్పు చేసినా!…” అడిగాడు వీరయ్య ఆశ్చర్యంతో..
“నీవేం తప్పు సేయలా!… కాని వూరోల్లు మనల్ని తప్పుగా
అనుకొంటుండారు!…”
“ఓ… అదా సంగతి!…”
“అవును… ఇకపై రాకు!…”
అలాగే అన్నట్టు తల ఆడించి రోషంతో వెళ్లిపోయాడు వీరయ్య.
ఆ లేబర్ కాలనీ నుంచి పనిలోకి వచ్చే వాళ్లను అడిగి…పారిజాతం, పాప, వాళ్ల అమ్మానాన్నల క్షేమ
సమాచారాన్ని తెలుసుకొనేవాడు వీరయ్య.
పారిజాతం తండ్రి కోదండం ఎనబై ఏళ్ల వయస్సు… తల్లి కాంచన
యాబైఅయిదేళ్ల వయస్సు. కోదండం మొదటి భార్య చనిపోగా పదేళ్ల
తర్వాత కాంచనను చేసుకొన్నాడు కోదండం. వృద్ధాప్యం… పేదరికం…
పారిజాతం భర్త చనిపోయాడనే బాధతో ఓ రాత్రి కోదండం గుండె
పోటుతో మరణించాడు.
విషయాన్ని విన్న వీరయ్య వచ్చి కోదండాన్ని స్మశానానికి
కొడుకులా తరలించాడు. చేయవలసిన విధులను తన ఖర్చుతో నెరవేర్చాడు.
ఆ సందర్భంలో పారిజాతం ఎదురైనా ఒక్క మాట కూడా
మాట్లాడలేదు. కోదండం క్రతువులు ముగించి బిల్డింగ్ దగ్గరకి వస్తూ…
మనస్సులోని బాధను మరిచేదానికి తాగి వచ్చాడు వీరయ్య. వాచ్ మెన్
ఖాసిం… వయస్సులో వీరయ్యకన్నా పదేళ్లు పెద్ద. త్రాగి తూలుతూ వచ్చిన
వీరయ్యను చూచి ఆశ్చర్యపోయాడు.
“రేయ్!. వీరన్నా!… ఏంట్రా ఇది!…”
“ఖాసిం భాయ్!… మన్నించు… మనసేం బాగాలేదు… అందుకే
ఏసినా!…” విరక్తిగా నవ్వాడు వీరయ్య.
వీరయ్య… ఇంతకుముందు తనను గురించి, పారిజాతాన్ని గురించి లేబర్ కాలనీవాళ్లు అనుకొన్న తప్పుడు మాటలను గురించి….
పారిజాతం తనను వారి ఇంటికి రావద్దని చెప్పిన మాటలను… ఖాసింకు చెప్పాడు.
తూలి పడబోయిన వీరయ్యను పట్టుకొన్నాడు ఖాసిం… మెల్లగా
అతన్ని తన గుడిసెకు చేర్చాడు. చాపపై పడుకోబెట్టాడు. వీరయ్య వీపుమీద చేయివేసి…
“ఏనాడు లేంది… ఈరోజు తాగావు… దీనికి కారణం ఏమిటో నీవు
చెప్పకపోయినా నాకు తెలుసు వీరన్నా!…”
” ఆ… కారణం… నేను తాగిందానికి కారణం… నీకు తెలుసా!…అదేంటో చెప్పు!…” హేళనగా నవ్వుతూ అడిగాడు వీరయ్య.
“పారిజాతం నిన్ను ఇంటికి రావద్దన్నదే కారణం!…” చెప్పాడు
ఖాసిం.
“అవును ఖాసిం భాయ్!… ఇటు చూడు… ఆ మాట ఈ గుండెల్ని
పొడుస్తా వుంది… మరచిపోలేక పోతుండా… పాపం ఆ పెద్దాయన పోయి…మొగదిక్కు లేదుకదా అని ఆయనకు చేయాల్సింది చేసినా!… పారిజాతం పలకరిస్తదనుకొన్నా!… అహ… ఒక్కమాట ఒక్కమాట కూడ మాట్లాడలేదు ఖాసింభాయ్… తలచుకొంటే గుండెల్లో మంట… అందుకే తాగిన… అన్నిటిని మరచి నిద్రపోవాలని…” విచారంగా చెప్పాడు వీరయ్య.
“వీరన్నా… నేను ఒక మాట చెబుతా వింటావా!…”
“చెప్పు భాయ్!…”
“నీవు పారిజాతాన్ని పెళ్లి చేసుకో!…”
“ఏందీ!… నాతో ఒక్క… ఒక్కమాట మాటాడని ఆ పిల్లను నేను
పెళ్లి చేసుకోవాలా!…” బాధగా నవ్వాడు వీరయ్య.
“నేను ఆ పిల్లతో మాట్లాడతా…”
“ఖాసింభాయ్… జరగని మాటలెందుకు… ఎల్లు… నీచోటికి
ఎల్లు… నేను తొంగుంటా!…” అన్నాడు వీరయ్య చేతిని ఊపుతూ…
ఖాసింభాయ్… సాలోచనగా వీరయ్య గుడిశ నుండి బయటికి వచ్చాడు. అతని మనస్సులో ఎలాగైనా పారిజాతానికి వీరయ్యకు పెండ్లి జరిపించాలనే నిర్ణయం.
**
పారిజాతం వయస్సు ఇరవై ఆరు…. ఓ బిడ్డకు తల్లి అని ఎవరైనా
చెబితే తప్ప… కొత్తగా చూచినవారు ఆమెకు ఇంకా వివాహం కాలేదనే
అనుకొంటారు. చామనఛాయ.. చక్కటి అంగసౌష్టవం… ఎపుడూ నవ్వుతూ కనుపించే పారిజాతానికి అందరినీ ఆకర్షించే గొప్ప లక్షణాలు ఉన్నాయి.
పారిజాతం పనిచేసే ఒక ఇంటి యజమాని… వారి భార్య
బంధువుల వివాహానికి విజయవాడ వెళ్లారు. వారి సుపుత్రుడు
భాస్కరరావు… పశువుల డాక్టర్ చదువు వెలగబెడుతున్నాడు. పాతిక
సంవత్సరాల వయస్సు.
ఆ ఇంట్లో పారిజాతం పనికి చేరిన నాటినుంచి.. భాస్కరానికి ఆమె పట్ల ఆకర్షణ. సరదాగా మాట్లాడుతూ దినదినానికి పరిచయాన్ని పారిజాతంతో పెంచుకొన్నాడు. అప్పుడప్పుడూ యాభై… వంద బక్షిస్ పంకజానికి ఇచ్చేవాడు. ఆమె పనితీరు మెచ్చుకొనేవాడు. తల్లితండ్రీ… విజయవాడకు వెళ్లినందున… తన చిరకాల వాంఛను తీర్చు కొనేటందుకు సమయం ఆసన్నం అయిందని సంబరపడ్డాడు భాస్కరరావు.
ఉదయం తొమ్మిది గంటలకు పారిజాతం… కాలింగ్ బెల్
నొక్కింది. ఆమె రాకకోసం వేచియున్న భాస్కరరావు ఆనందంగా నవ్వుతూ
తలుపు తెరిచాడు.
“రా!… పారిజాతం… నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను…”.
నవ్వుతూ చెప్పాడు భాస్కరరావు.
“ఏం బాబూ!… ఏంకావాలి… సెప్పండి” చిరునవ్వుతో అడిగింది
పారిజాతం.
“నేనడిగింది ఇస్తావా పారిజాతం?…”
“వుంటే ఇస్తా… ఇంతకీ నీకేం కావాలా?…”
“ఓ కప్పు కాఫీ ఇస్తావా!…”
“ఓ.. కూర్చోండి. పది నిముషాల్లో కాపీ తెస్తా!…” వంటగది వైపుకు
వెళ్లింది పారిజాతం. స్టవ్ వెలిగించి గిన్నెతో నీళ్లు పెట్టింది. భాస్కరరావు
సింహద్వారాన్ని బిగించి మెల్లగా వంట గదిని సమీపించాడు.
పారిజాతం సింక్ లో అంట్లు తోముతూ వుంది. భాస్కరరావు ఆమె వెనుక భాగాన్ని చూచాడు. మదిలో విరహతాపం… మెల్లగా వెళ్లి
పారిజాతాన్ని సమీపించి తన చేతులను ఆమె నడుముకు చుట్టేసి….తనవైపుకు లాక్కున్నాడు.
పారిజాతం… బెదిరిపోయింది. తన కళ్లకు కనిపిస్తున్న భాస్కరరావు
చేతులను తన చేతులతో బలవంతంగా విడదీసి… అతనికి ఎదురు తిరిగి అతన్ని తోసివేసింది.
“రేయ్!… నిన్ను నేను నా తమ్ముడిలా చూచుకొన్నా!… నీవు అడిగిందల్లా నీకు అందించినా!… నీ మనస్సులో ఇలాంటి పాడు ఆలోచనలుండా యని నాకు తెలియకపాయె… ఛీ!… నీదీ ఒక బతుకేనా!… ఈ బతుకు బతికేదానికన్నా దేంట్లోనైనా దూకి చావరాదు!…” ఆవేశంతో అంది పారిజాతం.
భాస్కరరావు చెవులకు ఆ మాటలు సమ్మెట దెబ్బలావినిపించాయి. పౌరుషం… రోషం… కామం… అతని కళ్లల్లో చోటుచేసుకొన్నాయి. తన పశుబలంతో పారిజాతాన్ని నేల పడదోశాడు. ఆమెపై వాలి తన చేతులతో ఆమె చేతులను గట్టిగా పట్టుకొన్నాడు. తన కాళ్లతో ఆమె కాళ్లను తొక్కిపట్టి పారిజాతాన్ని కదలనివ్వలేదు.
“పారిజాతం!… నీవంటే నాకు ప్రాణం. నేను నిన్ను మహారాణిలా
చూచుకొంటా… నన్ను ఎదిరించకు… నామాట విను…” ఆవేశంతో అన్నాడు
భాస్కరరావు.
అతని చేతులను కాళ్లను ప్రక్కకు త్రోసి లేవాలని పారిజాతం చేసిన ప్రయత్నం విఫలమయింది. ఎదిరించి లేచి పోలేని స్థితి… డేగనోట చిక్కిన కోడిపిల్లలా అయిపోయింది పారిజాతం. కన్నీరు కార్చుకొంటూ భాస్కరరావు కబంధ హస్తాల్లో చిక్కుకొంది.
**
సమయం పన్నెండు గంటల ప్రాంతం. భాస్కరరావు వెళ్లి ఇంటి
సింహద్వారాన్ని తెరిచాడు.
ఎంతో ఆవేదనతో… పారిజాతం… తలదించుకొని మౌనంగా ఆ
ద్వారాన్ని దాటి… గృహ ప్రాంగణాన్ని దాటి… వీధిలోకి ప్రవేశించింది. తన గుడిసెకు చేరింది. పారిజాతాన్ని చూచిన తల్లి కాంచన….
“ఏమయిందే… అదోలా వుండావ్!..” అడిగింది.
“అలసటగా వుందే… కాసేపు నిదురపోతా!…” మెల్లగా చెప్పింది
“అట్టాగే నిదురపోదువుగాని… నేను చెప్పే మాట యిను..”
“చెప్పు…” చాపపై కూర్చుని అడిగింది పారిజాతం.
“పదిగంటలప్పుడు ఖాసింభాయ్ వచ్చిండు…”
“ఎందుకొచ్చిండు….”
“నీవు సరే అంటే… నీకు వీరయ్యకు పెళ్లి జరిపిస్తడంట!…”
ఆశగా కూతురుముఖంలోకి చూస్తూ చెప్పింది కాంచన.
ఆశ్చర్యంతో చూచింది తల్లి ముఖం లోకి పారిజాతం…
“నే చెప్పింది నిజమే!… ఆ పిల్లాడికి నీవంటే ఎంతో ఇష్టమంట…
నీకూ ఇష్టమేనా!…”
పారిజాతం మౌనంగా కళ్లు మూసు కొంది. ఆమె కళ్లనుండి కారిన
కన్నీరు చక్కిళ్ల పైకి దిగజారాయి.
ఆకన్నీటిని చూచిన కాంచన… “ఎందుకే ఏడుస్తుండావ్?”ఆత్రంగా అడిగింది.
“ఆ అబ్బికి నేను తగినదాన్ని కాదు.. చెప్పి పంకజం చాపపై పడుకొంది.
“నీవంటే వాడికి పేణమంటే!…” తాపత్రయంతో చెప్పింది.
“నాకు మరో పెళ్లి మీద ఆశలేదు. నన్ను నిదురపోనీ…ఇకమాటాడకు” ఆవేశంగా చెప్పి తల్లికి వీపు మళ్లించి ప్రక్కకు తిరిగి పడుకొందిపారిజాతం.
“దీనికి చాలా తల పొగరు. మంచి మాట చెబితే ఇనిపించుకోదు…” అనుకొంటూ కాంచన గుడిశ నుండి బయటికి నడిచింది.
పారిజాతం… పడుకొని కళ్లు మూసుకొందేకానీ… ఆమె మనస్సులో
ఆరోజు జరిగిన సంఘటన కారణంగా ఎంతో బాధ… కలవరం… బ్రతుకు
మీద విరక్తి… ఆగని ఏడుపు….
తల్లి కాంచన… వీరయ్య విషయంలో చెప్పిన మాటలు… ఆమెచెవుల్లో మారుమ్రోగాయి.
“వీరయ్య… ఎంతో మంచివాడు. నా మొగుడు పోయాక మాకుటుంబానికి ఎంతో సాయం చేసిండు. నాయన కతవు ఖర్చులుసేసిండు.. నేను అన్నా నా బిడ్డలన్నా ఎంతో ఇష్టం… నేను వూరోళ్ల మాటవిని నా యింటికి రావద్దన్నా… నాయన పోయినప్పుడు వచ్చిపోయిండే…..యీ వైపు తొంగిసూళ్లే… మాట మీద నిలబడ్డాడు. సంవత్సరం రోజులాయె…అంత మంచోడికి నేను తగను. ఈరోజు జరిగింది చచ్చేవరకూ
మరచిపోలేను. పదేపదే గుర్తుకొచ్చే ఆ ఇసయాన్ని మరచిపోవాల… బ్రతికుంటే అది కుదరదు. ఛీ పాడుబతుకు … ఛస్తే బాధా వుండదు.నేను ఇక బతికుండ కూడదు… చచ్చిపోవాలి… చచ్చిపోవాలి… మనసుకు
శాంతికావాలంటే చావక తప్పదు.’ ఆ నిర్ణయానికి వచ్చిన పారిజాతం..
ఆవేశంగా లేచి గుడిసె బయటికి వచ్చింది.
వాకిట్లో కూర్చొనివున్న కాంచన పారిజాతాన్ని చూచి… “ఏడికే
బయలుదేరావ్?…” అడిగింది.
విరక్తిగా నవ్వి… చూపుడు వేలును ఆకాశం వైపుచూపుతూ…
“ఆ వీరయ్య కాడికి…” వేగంగా ముందుకు నడిచింది పారిజాతం.
“కాస్త నెమ్మదిగా మాటాడు… ఆ పిల్లోడి మనసు నొప్పించకు…
వాడు సెప్పే మాట ఇనుకో…” అంది కాంచన.
తల్లి మాటలకు జవాబు చెప్పకుండా పూనకం వచ్చిన మనిషిలా
ముందుకు వేగంగా సాగిపోయింది పారిజాతం.
***
బావిలో దూకపోయిన పారిజాతాన్ని భుజాలను పట్టుకొని వెనక్కు
లాగాడు వీరయ్య.పారిజాతం వెనుతిరిగి అతని ముఖంలోకి ఆశ్చర్యంతో చూచింది.ఆమె కళ్లల్లోని కన్నీటిని… ఆమె ముఖంలోని ఆవేదనను చూచిన వీరయ్య…
“బావిలో దూకి చావాలనుకొన్నావా!… నీవు ఛస్తే నీ బిడ్డ గతేంటి?… వున్నోడికి లేని మనబోటోళ్లకి అందరికీ ఏదో ఒక కష్టం వుంటది.
కష్టంగా వుందనుకొంటూ అందరూ నీలా చావాలని ప్రత్నించి ఛస్తే…
యాడాది లోపలే మన దేశ జనాభా తగ్గిపోద్ది. జీవితమంటే ‘చీకటి..
వెలుగు… దు:ఖం… సుఖం… కష్టకాలంలో జీవితంతో రాజీపడి పట్టుదలతో బతికి సుఖాన్ని సాదించుకోవాల… జరిగిన దాన్ని తలచుకొంటూ ఆవేశంతో
ఛస్తే… నీవు చావడమే కాదు… నీ వాళ్లనందరినీ చంపిన దానవౌతావ్.
నీవు ఛస్తే నీ మీదపడ్డ మచ్చ మాసిపోదు… కాలానికి ఎదురీది జీవితంతో పోరాడాలి… చచ్చి సాధించేదంటూ ఏమీ వుండదు… ఏదైనా బ్రతికే సాధించగలం.. నీ గడచిన కత నాకనవసరం. నీవు సరే అంటే నిన్ను పెళ్లి చేసుకొంటా..నీ బిడ్డని నా బిడ్డలా చూచుకొంటా… నేను నమ్మిన ఆ నా సుబ్రమణ్యేశ్వర స్వామి సాక్షిగా చెబుతుండా!… నీవంటే నాకు ఎంతో ఇష్టం పారిజాతం… కట్టడం మూడో అంతస్తులో నుంచి నిన్ను చూచినా…
నీ నడక వేగంలో నాకు అనుమానం కలిగింది. వేగంగా నీ ఎనకాలే
వచ్చినా… నిన్ను కాపాడినా!… నా మాటలమీద నీకు నమ్మకం వుంటే.. నీ చేతిని నా చేతిలో వెయ్యి.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా.. నా జీవితాంతం నీకు తోడుగా నీడగా వుంటా!…” చెప్పడం ఆపి వీరయ్య తన కుడిచేతిని ముందుకుసాచాడు.
పారిజాతం… ఏడుస్తూ అతని కాళ్లను తాకపోయింది.. భుజాలను
పట్టుకొని ఆపాడు వీరయ్య. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు.
తన పై కండువాతో ఆమె కన్నీటిని తుడిచాడు.
వీరయ్య… ఆమె చేతిని వదలలేదు… ఇరువురూ భావి జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ముందుకు నడిచారు.
చతుర్వేదుల చెంచుసుబ్బయ్య శర్మ (చెన్నై)
Chaturvedula Chenchu Subbiah Sharma,Telugu Kathalu,Telugu Poets,Jeevitam Ante