జీవ సమరం

2023-10-19 18:05:40.0

https://www.teluguglobal.com/h-upload/2023/10/19/843625-jeevana-samaram.webp

మెట్లు కనబడుతుంటాయి

కాలు మోపితే జారే గుణం

అయినా ఎక్కి పైకి చేరాల్సిన అనివార్యత-

ఎంత నిలబెడుతున్నా

కూలిపోతుండే నిచ్చెన

నిలబెట్టినా

ఎక్కడానికి వీల్లేని శూన్యత-

ఎలాగో పైకి చేరినా

నిలదొక్కుకోలేని పరిస్థితి

తోసివేత,లాగివేతల దుస్థితి-

ఆశయం చెట్టు విరబూసినా

ఆకులు రాల్చేసి కొమ్మలు విరిచేసే తుపాన్

పరుగులుపెడుతూ

అలసిన దేహానికి

ఆగి, కాలుమోపి సేద తీరే

కూసింతస్ధలం ఎక్కడా దొరకదు-

చేరనివ్వని ఎండమావి గమ్యం

చేపినా పాలు పితకనివ్వని కొమ్ములు

చెంతకి రానివ్వని లేగదూడ కోసం ఎదురుచూపులు-

సాధ్యాసాధ్యాల

జీవనరేఖపై చేసే ప్రయాణం

ఒక ప్రయత్నం

నీటి కోసం బతుకుబావిలో దిగడం

సాధ్యా సాధ్యాలు లెక్కించని ఓ తంతు-

చివరికి

గమ్యం ఎదురవుతుందో లేదో

మధ్యలోనే

ముగిసిపోతుందో!

– మాధవి సనారా

(అనకాపల్లి)

Madhavi Sanara,Jeeva Samaram,Telugu Kavithalu