జేఎన్టీయూ రిజిస్ట్రార్‌పై సీఐడీ విచారణకు హైకోర్టు ఆదేశం

2024-07-24 05:16:08.0

రిజిస్ట్రార్‌పై నమోదైన పిటిషన్‌ నేపథ్యంలో ఆయనకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టులో హాజరుకాకపోవడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

https://www.teluguglobal.com/h-upload/2024/07/24/1346721-high-court-orders-cid-inquiry-against-jntu-registrar.webp

కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌పై సీఐడీ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. అర్హత లేని 48 కళాశాలలకు అటానమస్‌ హోదా కల్పించారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేసి ఈనెల 26న ఎఫ్‌ఎస్‌ఐఆర్‌ను తమ ముందు ఉంచాలని ఆదేశాలిచ్చింది.

నిబంధనలకు విరుద్ధంగా 48 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అటానమస్‌ హోదా కల్పించారంటూ కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌పై పలువురు ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచార‌ణ చేపట్టిన హైకోర్టు.. ఈ కేసుపై దర్యాప్తు జరిపి ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేయాలని సూచించింది. రిజిస్ట్రార్‌పై నమోదైన పిటిషన్‌ నేపథ్యంలో ఆయనకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టులో హాజరుకాకపోవడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.