2025-02-24 06:28:08.0
ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సమయం ఉంది కానీ టన్నెల్‌కు వెళ్లే టైమ్ లేదా అని మాజీ మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రిని ప్రశ్నించారు
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది ఆచూకీ తెలియని స్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రికే సీరియస్‌నేస్ లేకపోతే అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అని నిలదీశారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు వెళ్లే టైమ్ లేదా? ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా ? అని ప్రశ్నించారు. బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే సీఎం.. కాంగ్రెస్ ప్రభుత్వకు కనీస మానవత్వం కూడా లేదా? అని ప్రశ్నించారు. ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యూయేట్స్‌కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాత పెడ్తారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నెల్‌లో ఇరుక్కున్న ఎనిమిది రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్లొన్నారు.
SLBC Tunnel,CM Revanth reddy,KTR,BRS Party,KCR,MLC election campaign,NDRF,Army,Telangana goverment,minister Uttam Kumar Reddy,Telangana