2024-07-16 02:47:43.0
ఆ పదవికోసం చాలా పోటీ ఉందని, 50మందికి పైగా ఆ పదవి కావాలని తనను అడిగారని చెప్పారు. అయితే అందులో తమ కుటుంబ సభ్యులు లేరని క్లారిటీ ఇచ్చారు పవన్.
https://www.teluguglobal.com/h-upload/2024/07/16/1344564-pawan-with-janasena-mlas.webp
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆ పదవి ఎవరికివ్వాలనే విషయంలో కూటమి ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. చాలామంది పేర్లు వినిపించినా చివరకు ఎవరూ ఫైనల్ కాలేదు. కానీ ఆ పదవి జనసేనకు ఖాయమనే ప్రచారం ఇప్పడు జోరందుకుంది. జనసేనకు చెందిన నేతల్లో ఒకరికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని అంటున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చాయి.
టీటీడీ చైర్మన్ పదవికి మొదటగా వినిపించిన పేరు నాగబాబు. ఆ వార్తల్ని వెంటనే ఆయన ఖండించారు కూడా. ఆ తర్వాత టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేసిన ఒకరిద్దరి పేర్లు కూడా వినిపించినా, ఏదీ వాస్తవం కాదు అని తేలిపోయింది. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు కూడా వార్తల్లోకి వచ్చింది కానీ చంద్రబాబు ఇంకా ఎవరికీ ఆ పదవి ఖాయం చేయలేదని స్పష్టమైంది. తాజాగా జనసేన మీటింగ్ లో టీటీడీ చైర్మన్ పదవి గురించి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికోసం చాలా పోటీ ఉందని, 50మందికి పైగా ఆ పదవి కావాలని తనను అడిగారని చెప్పారు. అయితే అందులో తమ కుటుంబ సభ్యులు లేరని క్లారిటీ ఇచ్చారు పవన్. మరి ఆ 50మందిలో ఆ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.
జనసేన ప్రజా ప్రతినిధుల సన్మాన సమావేశంలో నామినేటెడ్ పోస్ట్ ల ప్రస్తావన వచ్చింది. అవకాశాలు, అర్హతను బట్టి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానన్నారు పవన్ కల్యాణ్. పార్టీలో ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద పోస్టులు ఆశిస్తున్నారని.. ఉన్న అవకాశాలు, కూటమి పార్టీల మధ్య పంపకాలను బట్టి పదవులు దక్కుతాయని చెప్పారు. పదవులు ఆశిస్తున్నవారు అర్హతను బట్టి అడిగితే కమిటీలో పెట్టి చర్చిస్తామని, పార్టీకి ఎలా పని చేశారో దాని ఆధారంగా పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు పవన్.