2022-06-19 02:47:46.0
టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్, 4వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాజట్ల మధ్య జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. సిరీస్ లోని మొదటి నాలుగు మ్యాచ్ ల్లో రెండుజట్లు చెరో రెండు నెగ్గి 2-2తో సమఉజ్జీలుగా నిలవడంతో విజేతను నిర్ణయించే ఆఖరాటకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరు రెండుజట్లకూ చావోబతుకో అన్నట్లుగా మారింది. ఆత్మవిశ్వాసంతో […]
టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్, 4వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాజట్ల మధ్య జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది.
సిరీస్ లోని మొదటి నాలుగు మ్యాచ్ ల్లో రెండుజట్లు చెరో రెండు నెగ్గి 2-2తో సమఉజ్జీలుగా నిలవడంతో విజేతను నిర్ణయించే ఆఖరాటకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరు రెండుజట్లకూ చావోబతుకో అన్నట్లుగా మారింది.
ఆత్మవిశ్వాసంతో భారత యువజట్టు..
కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, సూపర్ ఓపెనర్ రాహుల్ , షమీ, బుమ్రా లాంటి పలువురు దిగ్గజ క్రికెటర్లు లేకుండానే ..రిషభ్ పంత్ నాయకత్వంలోని యువజట్టు ప్రస్తుత ఈ సిరీస్ లో అసమానపోరాట ప్రతిభ కనబరచింది.
మొదటి రెండుమ్యాచ్ ల్లో ఘోరపరాజయాలు ఎదురైనా..విశాఖలో జరిగిన మూడు, రాజ్ కోటలో ముగిసిన నాలుగు టీ-20 మ్యాచ్ ల్లో భారీవిజయాలు సాధించడం ద్వారా భారతజట్టు సిరీస్ విజయావకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది. ఆఖరి మ్యాచ్ లోనూ అదేజోరు ప్రదర్శించడం ద్వారా సిరీస్ నెగ్గాలన్న పట్టుదలతో ఉంది.
ఓపెనర్లు రితురాజ్ గయక్వాడ్, ఇషాన్ కిషన్ , మిడిలార్డర్లో కెప్ట్టెన్ పంత్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, వెటరన్ దినేశ్ కార్తీక్, స్పిన్ జోడీ అక్షర్ పటేల్, యజువేంద్ర చహాల్, పేస్ జంట ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ నిలకడగా రాణిస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నారు.
శ్రేయస్ అయ్యర్ సైతం పూర్తిస్థాయిలో రాణించగలిగితే భారత్ విజయావకాశాలు మరింత మెరుగుగా ఉంటాయి.
అయోమయంలో సఫారీలు…
సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో చెలరేగిపోయిన దక్షిణాఫ్రికా ఆ తర్వాతి రెండుమ్యాచ్ ల్లోనూ తక్కువ స్కోర్లకే కుప్పకూలడం ద్వారా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది.
కెప్టెన్ బవుమా, డాషింగ్ ఓపెనర్ క్వింటన్ డి కాక్, సూపర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్, డూసెన్ స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితేనే నిర్ణయాత్మక ఈ ఆఖరిపోరులో సఫారీలు పైచేయి సాధించే అవకాశం ఉంది.
భారత్ 11- దక్షిణాఫ్రికా 8
ప్రస్తుత సిరీస్ లోని నాలుగో టీ-20 మ్యాచ్ వరకూ టాప్ ర్యాంకర్ భారత్ తో 4వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాజట్టు 19సార్లు తలపడింది. భారత్ 11 మ్యాచ్ లు నెగ్గితే , దక్షిణాఫ్రికా 8 విజయాలు మాత్రమే నమోదు చేసింది.
ఇక …బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్ ఆడిన గత ఐదు టీ-20 మ్యాచ్ ల్లో 2 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో ఉంది. గ్రౌండ్ చిన్నది కావడం…అవుట్ ఫీల్డ్ మెరుపువేగంతో ఉండడంతో భారీస్కోరింగ్ మ్యాచ్ నమోదయ్యే అవకాశం ఉంది. అయితే..మ్యాచ్ ప్రారంభానికి రెండుగంటల ముందే వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీచేయటంతో..మ్యాచ్ పైన వానదెబ్బ పడినా ఆశ్చర్యంలేదు.హేమీహేమీలు లేకున్నా యువఆటగాళ్లతోనే దక్షిణాఫ్రికాకు గట్టిపోటీ ఇచ్చిన భారత్ సిరీస్ నెగ్గితే ..ఆ ఘనత మాత్రం చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కే దక్కుతుంది.
Bangalore Chinnaswamy Stadium,Captain Rohit Sharma,captain virat kohli,circket,five-match T20 series,India look towards T20 series,indian team,IPL,IPL 2022,South Africa,t20 series,t20 world cup,three T20 matches,top-ranked India