2025-01-07 07:03:55.0
పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లేఖ
డాక్టర్ బీఆర్ అంబేదర్క్ గౌరవం కోసం పోరాడుదామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ శ్రేణులకు మంగళవారం ఆయన లేఖ రాశారు. దేశం కోసం బలిదానాలు చేసిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, దేశంలో లౌకికవాదం, ఐక్యత కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు జరుపుకోవాల్సిన ఈ శుభ తరుణంలో నియంతృత్వ బీజేపీ పాలనలో మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు పన్నుతున్న బీజేపీ, ఆ పార్టీ కీలకనేత అమిత్ షా అంబేద్కర్ ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసినా శిక్షంచకుండా వెనకేసుకొస్తుంది. 2024 డిసెంబర్ 26న బెళగావిలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో బీజేపీ తీరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ‘జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్’ పేరిట కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానాలు చేశారని తెలిపారు. ఆ వివరాలు మీ ముందు ఉంచుతూ, పార్టీ పిలుపిచ్చిన సందర్భంలో ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నానని తెలిపారు. సమావేశాలు జరుగుతుండగానే దురదృష్టవశాత్తు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెందడం పార్టీకి తీరని నష్టమన్నారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను ప్రధాని మోదీ వెనకేసుకు రావడం దురదృష్టకరమన్నారు. తన వ్యాఖ్యలపై అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. ఈనెల 26 వరకు ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను దేశవ్యాప్తంగా నిర్వహించి బీజేపీ మెడలను వంచాలని సీడబ్ల్యూసీ పిలుపిచ్చిందని వివరించారు. రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా ఉన్న 50 శాతం సీలింగ్ నిబంధనను తొలగించాలని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Congress Party,75 Years of Constitution,Dr. BR Ambedkar,Amit Shah,Narendra Modi,Sonia Gandhi,Rahul Gandhi,Mallikarjun Kharge,Mahesh Kumar Goud