ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ‘సంకల్ప పత్రా’ పార్ట్‌-2

2025-01-21 09:18:54.0

నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటన

https://www.teluguglobal.com/h-upload/2025/01/21/1396341-bjp.webp

అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఢిల్లీలోని రాజకీయపక్షాలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ మరో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని వాగ్దానం చేసింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది.

భీమ్‌రావు అంబేద్కర్‌ స్టైఫండ్‌ పథకం కింద ఐటీఐలు, పాలిటెక్నిక్‌ స్కిల్‌ సెంటర్లలో టెక్నికల్‌ కోర్సులు అభ్యసిస్తున్న షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు ప్రతి నెలా రూ. 1,000 చొప్పున స్టైఫండ్‌ అందజేస్తామని తెలిపింది. తాము అధికాకారంలోకి వస్తే ఆప్‌ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి సిట్‌ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఈ మేరకు ‘సంకల్ప పత్రా’ పార్ట్‌-2ను ఆయన విడుదల చేశారు.

ఇదివరకే ‘సంకల్ప పత్రా’ పార్ట్‌-1 పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మ్యానిఫెస్టోను ప్రకటించిన విషయం విదితమే. తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్బిణులకు రూ. 21 వేల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను రూ. 500 ఇస్తామని పేర్కొన్నారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు.

BJP Manifesto 2.0,Delhi Elections,Party makes big promises,Students,youth,women,lpg subsidy,MP Anurag Thakur