తగ్గిపోతున్న శాకాహారులు.. మాంసాహారుల్లో మహిళలే ఎక్కువ..

2022-06-17 05:37:35.0

మాంసాహారం మంచిదా..? శాకాహారం ఒక్కటే సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుందా..? అనే చర్చ ఎలా ఉన్నా.. దేశంలో ఇప్పుడు మాంసాహారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. శాకాహారులంతా క్రమక్రమంగా మాంసాహారులుగా మారుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మాంసాహారాన్ని వ్యతిరేకించే గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కూడా మాంసాహారుల సంఖ్య పెరగడం విశేషం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషుల నుంచి వివరాలు సేకరించింది. దేశంలో […]

మాంసాహారం మంచిదా..? శాకాహారం ఒక్కటే సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుందా..? అనే చర్చ ఎలా ఉన్నా.. దేశంలో ఇప్పుడు మాంసాహారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. శాకాహారులంతా క్రమక్రమంగా మాంసాహారులుగా మారుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మాంసాహారాన్ని వ్యతిరేకించే గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కూడా మాంసాహారుల సంఖ్య పెరగడం విశేషం.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషుల నుంచి వివరాలు సేకరించింది. దేశంలో మాంసాహారుల సంఖ్య గతంలోకంటే ఇప్పుడు 5 శాతం పెరిగింది. మహిళల్లో ఈ శాతం కేవలం 0.6 మాత్రమే. ఈమేరకు శాకాహారుల సంఖ్య తగ్గిపోయింది. రాష్ట్రాల వారీగా లెక్క తీస్తే. లక్ష ద్వీప్ లో అత్యథికంగా 98.4 శాతం మంది పురుషులు మాంసాహారులుగా ఉన్నారు. అంటే అక్కడి పురుషుల్లో పూర్తి శాకాహారులు కనీసం నూటికి ఇద్దరు కూడా లేరు. రాజస్థాన్ లో మాత్రం అత్యల్పంగా 14.1 శాతం మంది పురుషులు మాత్రమే మాంసాహారులు. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, గోవా, కేరళ, పుదుచ్చేరి.. ప్రాంతాల్లో మాంసాహారులు ఎక్కువగా ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే..?
ఏపీలో 97.4 శాతం మంది పురుషులు, 95 శాతం మంది మహిళలు మాంసాహారాన్ని ఇష్ట పడుతున్నారు. 2015–16లో జరిగిన సర్వేలో ఏపీలో 78.2 శాతం మంది పురుషులు మాంసాహారం తీసుకుంటే 2019–21 నాటికి అది 80 శాతానికి చేరుకుంది. మహిళల్లో మాంసాహారుల శాతం 71.2 నుంచి 83.6 శాతానికి పెరిగింది. తెలంగాణలో మాంసాహారం తీసుకునే పురుషుల సంఖ్య స్వల్పంగా తగ్గింది, మహిళల్లో మాత్రం 57.7 శాతం నుంచి 72.4 శాతానికి అనూహ్య పెరుగుదల కనిపించింది.

మహిళలే ఎక్కువ..
తెలుగు రాష్ట్రాల్లో మాంసాహారం తీసుకునే పురుషుల సంఖ్యతో పోల్చి చూస్తే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణలో శాకాహార మహిళలు కూడా ఇటీవల కాలంలో మాంసాహారంపై మక్కువ పెంచుకుంటున్నారు. వారానికోసారి మాంసాహారం తీసుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంది, ఆ తర్వాత తరచూ అనే ఆప్షన్ ని ఎక్కువమంది ఎంచుకున్నారు. ప్రతి రోజూ మాంసాహారం తీసుకునేవారి సంఖ్య మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 5 శాతం కంటే తక్కువగానే ఉంది.