తనిఖీలు చేస్తుండగా.. కానిస్టేబుళ్లపై దూసుకెళ్లిన కారు

https://www.teluguglobal.com/h-upload/2025/01/02/1390915-car-runs-over-constables.webp

2025-01-02 05:47:46.0

కిరంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో నేషనల్‌ హైవేపై టోల్‌ప్లాజా వద్ద జరిగిన ఘటన

గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుళ్ల నుంచి కారు దూసుకెళ్లిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకున్నది. కిరంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో నేషనల్‌ హైవేపై టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, కిర్లం పూడి ఎస్సై జి. సతీశ్‌, కానిస్టేబుళ్లతో వాహన తనిఖీలు చేపట్టారు.

అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో విశాఖ వైపు నుంచి రామహేమంద్రవరం వైపు వెళ్తున్న కారును పోలీసులు ఆపారు. కారును చుట్టుముట్టి వివరాలు తెలుసుకుంటుండగానే ఫాస్ట్‌ ట్రాక్‌ ద్వారా టోల్‌ పన్ను చెల్లించిన డ్రైవర్‌ వేగంగా కారును ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో వాహనం ముందు నిల్చుకున్న కిర్లంపూడి స్టేషన్‌ కానిస్టేబుల్‌ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్‌ను కారు ఢీకొని దూసుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని వెంబడించడంతో రాజానగరం సమీపంలోని కెనాల్‌ రోడ్డులో కారును వదిలి దుండగులు పరారయ్యారు. యూపీకి చెందిన ఆ కారును, అందులో ఉన్నగంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద నిందితులిద్దరిని పట్టుకున్నారు. ఈ ఘటనలో లోవరాజు అపస్మార స్థితికి చేరుకోగా మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వీరిద్దరిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Car Runs,Over Constables,During Vehicle Checks,Kakinada,Police apprehended suspects