తన్ని ….

2022-12-05 03:43:43.0

https://www.teluguglobal.com/h-upload/2022/12/05/429600-rains.webp

చెన్నై నగరాన్ని వానా వరదా ముంచేసి బతుకులు నానబెట్టేసిన సందర్భంగా డిసెంబర్ 5, 2015 నాడు వ్రాసిన కవిత

ఎటు చూసినా…

కొన్ని లక్షల మంది నాని పోయారు

మరిన్ని లక్షల మంది కందిపొయారు

ఇంకెన్నో లక్షల మంది తప్పిపోయారు

నిజంగా లైఫ్ అవుటాఫ్ గేర్ అంటే

ఏంటో కళ్ళకు కట్టింది …

తన్ని …

క్యాంటీన్లకు, మంచి నీళ్ళకు

మందుకూ … మాకుకూ …

అన్నానికీ… అడై కీ …

పప్పుకీ… ఉప్పుకీ …

తన “నామమే” ప్రీఫిక్స్ గా

చేసేసి

అహం బ్రహ్మాస్మి అనుకుని

ఆకాశాన్ని కూడా

ఆజ్జాపించేయ గలననుకునే

అమ్మని

అవాక్కయ్యేలా చేసింది …

తన్ని …

కొడుకులూ కూతుళ్ళూ

అల్లుళ్ళూ గిల్లుళ్ళూ

మనవళ్ళూ …మన వాళ్ళూ …

పెట్టేసుకుని … పెట్రేగి పోయిన

టీవీలూ, సెల్ ఫోన్లూ

రిమోట్ లేకుండా

సైలెంట్ అయిపోతే

కుళ్ళును కూడా నల్ల కళ్ళజోళ్ళో

కప్పెట్టి పళ్ళికిలించే

ముసలాయన్ని కూడా

మూగపోయెట్టు చేసింది …

తన్ని

నోటి తో బులెట్లను క్యాచ్ పట్టి

థుపుక్కున ఉమ్మేసే అంత వీజీ కాదనీ …

ఆ దేవుడు శాసిస్తాడూ

ఈ రోబో పాటిస్తాడూ …అన్నంత

సులభం కాదనీ

రాజకీయంలోకొస్తా

వస్తా అంటూ ఊరించి

ఊరికే …అని తుస్సుమనిపించే

కథానాయకునికీ …

నీతులు మాత్రమే చెబుతూ

చీకటి, ఆకలి రాజ్యాలనేలే …

జీవితం లో

వన్ టూ త్రీ అంటూ లెక్కపెట్టే

గండు వసంత కోకిల కీ …

టీ కప్పు లో టీ ఉంటుంది గానీ

మదర్ బోర్డ్ లో మదర్ ఉండదని

ఊరుని ముంచిన మంచి నీటి లో

మంచి లేదనీ

మందిని నవ్వించే

రాజకీయ ప్రతినాయకుడికీ …

ఇంకా మనకి తెలిసిన …

తెలియని

ఎందరో మితృలకీ …

అందరికీ

చెమట తేమ అంటే కూడా

ఒణుకు పుట్టించిన ..

తన్ని …

నేర్పిన పాఠాలు అన్నీ ఇన్నీ కావు

కుంభవృష్టి తో కువ కువ లాడిన

ఎండు గెడ్డ కూవం

చిల్లు పడ్డ అంబరం

గొల్లుమన్న్ తాంబరం

ఊగిన అడయారు మర్రి

తడిసిపోయిన వేలాచెర్రీ

అదిరిపడ్డ రాజకీయ ఘూకం

నీరు దిగిన మీనంబాకం …

ఎండిన కడవలూ

రోడ్ల మీది పడవలూ

పక్కనే తేలియాడిన కార్లూ

ఆకాశ హర్మ్యాల మీద హాహాకారాలూ …

ఇజ్రాయిల్ పక్షి పేరో …

హిందీ హీరోయిన్ పేరో

గ్రీసు దేవత పేరో

పెప్సీ కూల్ డ్రింక్ పేరో

పెట్టుకోకుండానే …

అందర్నీ అదిరించి

భారత్ డెట్రాయిట్ ని బెదిరించి

టెక్నాలజీ ని ఎదిరించి

గర్వాన్ని ఒదిలించి

లోకాన్ని ఒణికించి

పాఠాలు నేర్పిన

తన్నీ …

ఇంక పో … ఇంకి పో …

మా ఆశల కన్నై

బాధలకి అన్నై

ప్రశాంతమైన మిన్నై

వదిలెయ్

మా చెన్నై

– సాయి శేఖర్

Sai Sekhar,Telugu Kavithalu,Telugu Poets