జగన్ హయాంలో ట్రూఅప్ చార్జీలు వసూలు చేశారంటున్న చంద్రబాబు.. ఇప్పుడువాటిని ఎత్తేస్తామని చెప్పగలరా? అని నిలదీశారు కాకాణి.
కూటమి ప్రభుత్వం ఒక్కో అంశంపై శ్వేతపత్రం విడుదల చేస్తుంటే.. వాటికి వైసీపీ నుంచి కౌంటర్లు రావడం సహజం. అయితే గతంలో ఆయా శాఖల మంత్రులుగా పనిచేసిన వారు సాధికారికంగా మాట్లాడి, సూటిగా బదులిస్తే రాజకీయ ఎదురుదాడి బ్రహ్మాండంగా ఉండేది. కానీ అన్నిటికీ ఒకరే అన్నట్టుగా ఇటీవల మాజీ మంత్రి కాకాణి ముందుకొస్తున్నారు. విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రానికి కూడా కాకాణి బదులిచ్చారు. 2014-2019 మధ్య విద్యుత్ రంగం నడ్డి విరిచిన చంద్రబాబు ఇప్పుడు తమపై నిందలు వేయడం సరికాదన్నారాయన.
చంద్రబాబు హయాంలో కొవిడ్ లేదని, ఉక్రెయిన్ యుద్ధం కూడా లేదని.. జగన్ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు నష్టం లేకుండా చేశామని వివరించారు మాజీ మంత్రి కాకాణి. జగన్ హయాంలోనే విద్యుత్ రంగం అభివృద్ధి చెందిందని అన్నారు. జగన్ హయాంలో విద్యుత్ రంగంలో ఏపీ వృద్ధిరేటు 4.7 శాతం అని, జాతీయ సగటుకంటే అది ఎక్కువ అని వివరించారు. శ్వేతపత్రం విడుదల కంటే, జగన్ ని విమర్శించేందుకే సీఎం చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయించారన్నారు కాకాణి. ప్రస్తుత పరిస్థితి వివరించాల్సిన శ్వేత పత్రంలో విమర్శలు ఎందుకన్నారు.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే విషయాన్ని చంద్రబాబు తన వివరణలో ఎందుకు దాటవేశారని ప్రశ్నించారు కాకాణి. జగన్ హయాంలో ట్రూఅప్ చార్జీలు వసూలు చేశారంటున్న చంద్రబాబు.. ఇప్పుడువాటిని ఎత్తేస్తామని చెప్పగలరా? అని నిలదీశారు. గతంలో తప్పులు చేసి, ఆ నెపాన్ని జగన్ పై నెట్టాలని చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.
ysrcp,ap politics,white paper,electricity department,Chandrababu Naidu,Kakani Govardhan Reddy