తాడేపల్లి చేరిన విశాఖ పంచాయితీ..

2022-06-05 22:29:43.0

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీ సమన్వయ కర్త పదవికి రాజీనామా చేశారు కానీ, పార్టీకోసం పనిచేస్తానంటున్నారు. ఆయన వ్యతిరేక వర్గం సీతంరాజు సుధాకర్ ని తాడేపల్లికి పిలిపించుకుని వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. కొద్ది రోజుల్లో వార్డు కమిటీల ఏర్పాటు చేయాల్సిన టైమ్ లో విశాఖ దక్షిణ నియోజకవర్గం పంచాయితీ వైసీపీకి తలనొప్పిగా మారే అవకాశముంది. నష్టనివారణ చర్యలు.. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే […]

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీ సమన్వయ కర్త పదవికి రాజీనామా చేశారు కానీ, పార్టీకోసం పనిచేస్తానంటున్నారు. ఆయన వ్యతిరేక వర్గం సీతంరాజు సుధాకర్ ని తాడేపల్లికి పిలిపించుకుని వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. కొద్ది రోజుల్లో వార్డు కమిటీల ఏర్పాటు చేయాల్సిన టైమ్ లో విశాఖ దక్షిణ నియోజకవర్గం పంచాయితీ వైసీపీకి తలనొప్పిగా మారే అవకాశముంది.

నష్టనివారణ చర్యలు..
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ మధ్య విభేదాలున్నమాట వాస్తవమే. అయితే ఇన్నాళ్లూ సర్దుకుపోతారని అధిష్టానం భావించినా అది సాధ్యపడలేదు. మరికొన్ని రోజుల్లో నియోజకవర్గంలో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ దశలో గ్రూపు రాజకీయాలు పెద్దవై వాసుపల్లి సమన్వయ కర్త పదవికి రాజీనామా చేశారు. ఆయనతో అధిష్టానం మాట్లాడే ప్రయత్నం చేసినా లాభం లేదు. ఆయన ఫోన్ స్విచాఫ్ చేసుందని చెబుతున్నారు. ఈ దశలో ప్రత్యర్థి వర్గం సీతంరాజు సుధాకర్‌ ని తాడేపల్లికి పిలిపించి మాట్లాడారు వైవీ సుబ్బారెడ్డి. తాను పార్టీ చెప్పినట్టే నడుచుకుంటున్నానని, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నానని చెప్పారు సుధాకర్. వాసుపల్లి అనుచరులతోనే ఇబ్బంది ఎదురవుతోందని వైసీపీతో వారు పూర్తిగా కలవలేకపోతున్నారని ఫిర్యాదు చేశారు.

వాసుపల్లి వ్యూహం ఏంటి..?
నియోజకవర్గంలో వాసుపల్లి సమన్వయ కర్తగా ఉన్నా కూడా సుధాకర్ హవా ఎక్కువగా ఉందనే ప్రచారం ఉంది. వాసుపల్లి ప్రమేయం లేకుండానే ఆలయ కమిటీలు, మసీదు, షాదీఖానా పాలక వర్గాలు ఎంపిక చేయడంతో ఆయన వర్గానికి ప్రాధాన్యం దక్కలేదు. పోటా పోటీగా నియోజకవర్గంలో వాసుపల్లి, సుధాకర్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ తనదేనంటూ సుధాకర్ ప్రకటించుకున్నారనే విషయంపై కూడా వాసుపల్లి వర్గం ఫిర్యాదు చేస్తోంది. సమన్వయ కర్త పదవికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో టీడీపీ తనను ఎప్పుడూ అగౌరవపరచలేదనే విషయాన్ని వాసుపల్లి బలంగా చెప్పారు. అంటే ఆయన టీడీపీలోకి వెళ్లేందుకే సిద్ధమయ్యారా అనే అనుమానం కూడా నియోజకవర్గ నేతల్లో ఉంది.

ప్రస్తుతానికి సుధాకర్ తో మాట్లాడిన వైసీపీ పెద్దలు, వాసుపల్లిని పిలిపించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ చర్చల వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. వాసుపల్లి నుంచి స్పష్టమైన ప్రకటన వస్తే విశాఖ పంచాయితీకి ఫుల్ స్టాప్ పడుతుంది.

 

AP,Brahmin Corporation Chairman,Disputes,MLA Vasupalli Ganesh,Seetanraju Sudhakar,ycp