తారకము (కవిత)

2023-01-26 08:46:59.0

https://www.teluguglobal.com/h-upload/2023/01/26/720772-tharakamu.webp

అంధకారంలో అగమ్యంగా నడుస్తున్నపుడు

పాండిత్యం సాయం కోరాను

అది చిరువెలుగై ప్రకాశించింది

గమ్యాన్ని మాత్రం ఆ వెలుగులో

నన్నే వెతుక్కోమంది

అనుమానం అగాథమై

అడ్డం వచ్చినపుడు

తర్కాన్ని గట్టిగా పట్టుకున్నాను

అది తాడులా

అవతలిగట్టుకి వూగింది

అక్కడ నేను కాలు మోపేలోపూ

అంతే వేగంతో నను వెనక్కి లాగింది

అహమూ మోహమూ

నిలువెత్తు అలలై ఎగసినపుడు

శ్రద్ధని ఎలుగెత్తి పిల్చాను

అది నావలా నది మధ్యకు నడిచివచ్చింది

ఆదరంగా నవ్వి

నను దరిచేర్చగలనని

మాట యిచ్చింది

– శ్రీవల్లీ రాధిక

Tharakamu,Telugu Kavithalu,Srivalli Radhika