https://www.teluguglobal.com/h-upload/2025/01/02/1390964-supreme-court.webp
2025-01-02 08:52:17.0
ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తిరుపతన్న ప్రధాన నిందితుడని తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. ఆధారాలు చెరిపేయడంలోనూ కీలకంగా ఉన్నారన్నారు. 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చేశారని చెప్పారు.
మరోవైపు తిరుపతన్న పాత్రపై ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ దవే తెలిపారు. 9 నెలలుగా జైలులో ఉన్నారని వాదించారు. తప్పనిసరైతేనే జైలులో ఉంచాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పులిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. బెయిల్ పొందదడం హక్కు అని చెప్పారు. ఈ క్రమంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదని చెప్పింది.
దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొన్నది. విచారణ పూర్తి చేయడానికి మరో 4 నెలలు పడుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఎంత సమయం పడుతుందో రాతపూర్వకంగా చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలో అఫిడవిట్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది లూథ్రా సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
Supreme Court Resumes,Hearing,On Additional SP Thirupathanna’s Bail Plea,Phone Tapping Case