తిరుపతి ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

https://www.teluguglobal.com/h-upload/2025/01/08/1392818-babu-on-ttd.webp

2025-01-08 17:53:04.0

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై సీఎం ఆగ్రహం.. భక్తుల రద్దీ మేరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను ప్రశ్నించిన బాబు

వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతో కలిచి వేసిందన్నారు. అస్వస్థతకు గురైన బాధితులకు అందుతున్న వైద్య చికిత్సపై అధికారులతో సీఎం మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌, టీటీడీ అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

మరోవైపు రేపు ఉదయం చంద్రబాబు తిరుపతికి వెళ్లనున్నారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలపై సీఎం సమీక్ష నిర్వహించారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు తెలిపారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. డీజీపీ, ఈవో, కలెక్టర్‌, ఎస్పీతో సీఎం మాట్లాడారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరం అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై సీఎం మండిపడ్డారు. భక్తుల రద్దీ మేరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను ప్రశ్నించారు.

Chandrababu Naidu shocked,Over Tirupati stampede,6 killed,Several injured,Vaikunta Dwara Darshanam