తెలంగాణకే కాదు ఏపీకి కూడా మోడీ ఏం చేయలేదు : కేటీఆర్

2022-06-06 05:20:38.0

సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతో పాటు ఏపీకి కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదని టీఎస్ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 2014లో రాష్ట్రం విడిపోయే సమయంలో స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రకటించారని. కానీ తెలంగాణ, ఏపీకి ఒక్క పైసా కూడా విదిల్చలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన కేంద్రం అణగదొక్కుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా […]

సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతో పాటు ఏపీకి కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదని టీఎస్ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 2014లో రాష్ట్రం విడిపోయే సమయంలో స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రకటించారని. కానీ తెలంగాణ, ఏపీకి ఒక్క పైసా కూడా విదిల్చలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన కేంద్రం అణగదొక్కుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల అభివృద్దికి కేంద్రం చేయూతనివ్వాలని ఆయన కోరారు.

రాష్ట్రాలు ఆర్థికంగా ఎంత బలంగా ఉంటే.. దేశం అభివృద్దిలో అంత ముందుకు పోతుందనే విషయాన్ని ప్రధాని మోడీ సహా ఢిల్లీలో ఉండే వారందరూ గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. కేంద్రంపై విమర్శలు ఎందుకు చేస్తున్నారు అని కొందరు అడగవచ్చు. అవును ఇది ప్రజాస్వామ్యం.. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఇది. ఇక్కడ మంచి పనులు చేస్తే తప్పకుండా మెచ్చుకుంటామని.. చెడ్డ పని చేస్తే తప్పకుండా విమర్శిస్తామని కేటీఆర్ చెప్పారు.

విమర్శ అనేది ఉండాలి.. అది తప్పకుండా ఎదుటి వ్యక్తిని, సంస్థను సరైన మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుందని వివరించారు. ఇండియా కనుక నిజంగా ముందుకు వెళ్లాలంటే.. రాజకీయాలను వెనుక సీట్లో కూర్చోబెట్టి.. ఆర్థిక వ్యవహారాలను ముందుకు తీసుకొని రావాలని మోడీ ప్రభుత్వానికి కేటీఆర్ చురకలంటించారు. పాలిటిక్స్ కేవలం ఎలక్షన్ల టైంలోనే మాట్లాడాలని.. అన్ని వేళలా రాజకీయాలే మాట్లాడుతుంటే భారత్ అభివృద్ది చెందిన దేశం కావాలనే కల ఎన్నటికీ నిజం కాదన్నారు.

ఇండస్ట్రియల్ కారిడార్లు అడిగితే ఇవ్వలేదు..
తెలంగాణకు ఆరు ఇండస్ట్రియల్ కారిడార్లు కావాలని కేంద్రానికి కోరితే ఇప్పటి వరకు ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి మంచిర్యాల, హైదరాబాద్ నుంచి వరంగల్, హైదరాబాద్ నుంచి విజయవాడతో పాటు మరొకటి కోరామన్నారు. కానీ దీనిపై కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హామీ రాలేదన్నారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణతో పాటు ఏపీ కూడా ఎలాంటి సాయం పొందలేక పోయాయన్నారు.

మేమేమీ అడుక్కోవడం లేదని.. మాకు హక్కుగా రావల్సిన వాటినే కావాలంటున్నామని అన్నారు. అలా అడిగితే నేను యాంటీ నేషనల్, యాంటీ మోడీ, యాంటీ గవర్నమెంట్ అయిపోతానా అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేం కేంద్ర ప్రభుత్వంతో రాజకీయంగా విభేదించవచ్చేమో.. కానీ మా రాష్ట్రానికి హక్కుగా రావల్సిన వాటిని వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్‌లో గిఫ్ట్ సిటీ పెట్టుకోండి.. కానీ ఇతర రాష్ట్రాలకు కూడా గిఫ్టులు ఇవ్వండి అని ఆయన కోరారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది మాటల్లో కాదు చేతల్లో చూపాలని ఆయన ఎద్దేవా చేశారు.

టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు రూ. 2.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి దాకా 16.48 మందికి ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

 

Annual report,Minister KTR,released,Telangana Industries Department.