2024-09-30 13:02:48.0
రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ
https://www.teluguglobal.com/h-upload/2024/09/30/1364680-harish-rao.webp
తెలంగాణలో బుల్డోజర్ రాజ్ నడుస్తోందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కాకుండా దుర్మార్గ దుష్టపాలన చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్ ముఖ్యనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతోందన్నారు. మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, హైడ్రా కూల్చివేతలపై సోమవారం హైకోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సాగిస్తున్న నిరంకుశ పాలన బుల్డోజర్ కు ప్రతీకగా మారిందన్నారు. ఈ పాలన తెలంగాణలో పౌరహక్కులను నిరంతరం ధిక్కరిస్తోందని తెలిపారు. హైడ్రా, మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని, ఏళ్లకేళ్లుగా అన్ని చట్టపరమైన పత్రాలతో నివసిస్తున్నవారి ఇళ్లను టార్గెట్ చేస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తూ బుల్డోజర్ పాలన నడుపుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వానికి బుల్డోజర్ ప్రతిరూపంగా మారిందని, అడుగడుగునా చట్టాలను తుంగలో తొక్కుతూ, సహజ న్యాయ సూత్రాలను కాలరాస్తూ కాంగ్రెస్ సీఎం పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. గడిచిన వంద ఏళ్లుగా ప్రాజెక్టులు, రోడ్లు, ఆఫీసులు, ఇతర నిర్మాణాల కోసం బుల్డోజర్లను ఉపయోగిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాలను కూల్చేసేందుకు అదే బుల్డోజర్లను ఉపయోగిస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో పేదలు, మధ్య తరగతిపై బీజేపీ బుల్డోజర్లను ఎలా ఉపయోగించిందో, కాంగ్రెస్ కూడా తెలంగాణలో అదే విధంగా ఉపయోగిస్తున్నదని తెలిపారు. ఈ విషయంలో బిజేపీ దారిలోనే కాంగ్రెస్ నడుస్తున్నదన్నారు. బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా, కనీసం సర్వే కూడా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల మీదికి బుల్డోజర్లు పంపుతూ వారిని కన్నీళ్లు పెట్టిస్తోందన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరచిన సహజ న్యాయ సూత్రాలు, చట్టాలను గౌరవించేలా ముఖ్యమంత్రికి సలహా ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
moosi project,HYDRA,demolition of houses,bulldozer raj,telangana,congress rule like bjp,harish rao,open letter to rahul gandhi