తెలంగాణలో మల్టిప్లెక్స్‌లకు హైకోర్టులో ఊరట

2025-03-01 07:30:51.0

16 ఏండ్లలోపు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించాలని హైకోర్టు ఉత్తర్వులు

రాష్ట్రంలోని మల్టిప్లెక్స్‌లకు ఊరట కల్పిస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 16 ఏండ్లలోపు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించాలని తెలిపింది. ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్వర్వులను హైకోర్టు సవరించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. సినిమా టికెట్ల ధర పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ బి. విజయ్‌ సేన్‌ రెడ్డి ధర్మాసనం ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వేలాపాల లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవద్దని ఆదేశించింది. అంతేగాకుండా ఈ విషయంపై అన్నివర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

ఈక్రమంలోనే హైకోర్టు ఉత్తర్వులపై మల్టీప్లెక్స్‌ యాజమాన్యం మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని కోరింది. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన ఉత్వర్వులను సవరించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవరకూ 16 ఏళ్లలోపు పిల్లలు థియేటర్లలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. 

Multiplexes in Telangana,Get relief,In High Court,16 years are allowed in all shows,High Court orders