తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో హై అలర్ట్‌

2025-02-18 08:59:25.0

మావోయిస్టుల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు

https://www.teluguglobal.com/h-upload/2025/02/18/1404572-maoist.webp

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ఎన్‌కౌంటర్లకు నిరసనగా బీజాపూర్‌, సుక్మా, దంతెవాడ జిల్లాల బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, పూసుగుప్ప, మారాయిగూడెం అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. బంద్‌లో మావోయిస్టులు విధ్వంసాలు సృష్టించే అవకాశం ఉన్నట్లు అందిన సమాచారంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే దక్షిణ సబ్‌ జోనల్‌ బ్యూరో, భారత కమ్యూనిస్టు పార్టీ అధికారప్రతినిధి సమత పేరుతో మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. బీజాపూర్‌ జిల్లాలోని నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వచ్చిన మావోయిస్టులపై కాల్పులు జరిపి చంపారని అందులో పేర్కొన్నారు. కొంతమంది గ్రామస్తులును బంధించి చిత్రహింసలను పెట్టారని లేఖలో తెలిపారు. బీజేపీ సాగిస్తున్న కగార్‌ హత్యాకాండలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఉద్యమం చేపట్టాలని కోరారు.

Police High Alert,On Maoist Bandh In Telangana,At Telangana- Chhattisgarh Border,Operation Kagar