తెలుగు వారు

2023-01-05 17:22:40.0

https://www.teluguglobal.com/h-upload/2023/01/05/434046-telugu-varu.webp

వేదాల నాడు ముక్కోటిగా వున్న దేవతలు

ఆది మునుల ఏ ఆగ్రహావేశ శాపంవల్లో

ఆంధ్రులై పుట్టారనుకుందాం

నాగరికత ఎంత పెరిగినా అది

వారి ముఖం వైపు చూడలేదు

ఆ నాటి అన్నాదమ్ముల తగాదా అలవాటు

వారిని వీడలేదు.

పరస్పర ద్వేష పర్వతం కవ్వంగా

ఇరుగూ పొరుగూ చూసి

విరగబడి నవ్వంగా

ముల్కీ మూల సిద్ధాంత వాసుకి తాడుగా

తెలుగువాడు ఏ మాత్రం

తెలివి లేని వాడుగా

సమైక్య జలధి మధించారు

స్నేహ బాంధవ్య భావాలు చెరి సగం వధించారు

పుట్టిన హాలా హల జ్వాల గొంతులో

పట్టుకునేవాడు లేక

భయంతో అందరూ

పురాణ విరుద్ధంగా

బ్రహ్మ దగ్గరకు పరుగెత్తారు

ఆయనకూ ఏం తోచక అందరూ కలిసి వైకుంఠానికి…

ఆలోచనాత్మక లోచనాల అంచులలో ఆర్ద్రత దట్టించి

ఇందిరాదేవి అంది గదా

“మీ రందరూ పుట్టుకతో దేవతలు

మనుగడలో రాక్షసులు

అయినా వైకుంఠ

మంగళ ద్వారాలు

మీ కోసం తెరిచి వుంచుతాను

కొంచెం ఓపిక పట్టండి అందరికీ అమృతం పంచుతాను “

– కుందుర్తి

Telugu Varu,Telugu Kavithalu