తొక్కలతో ఎన్ని లాభాలో!

https://www.teluguglobal.com/h-upload/2023/01/08/500x300_434368-fruits-skin.webp
2023-01-08 11:17:37.0

అందానికి, ఆరోగ్యానికి పండ్లు ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. అయితే కేవలం పండ్లు మాత్రమే కాదు, పండ్ల తొక్కలతో కూడా చాలా ఉపయోగాలున్నాయని తెలుసా?

అందానికి, ఆరోగ్యానికి పండ్లు ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. అయితే కేవలం పండ్లు మాత్రమే కాదు, పండ్ల తొక్కలతో కూడా చాలా ఉపయోగాలున్నాయని తెలుసా?

దానిమ్మ, అరటి, నారింజ లాంటి పండ్లు తిన్న తర్వాత వాటి తొక్కలను పారేయకుండా దాచిపెట్టుకుంటే వాటితో కొన్ని అదనపు లాభాలు పొందొచ్చు. ఏయే పండ్ల తొక్కలు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి దాన్ని గోరువెచ్చని నీటిలో కలిపుకోవాలి. దీన్ని పుక్కిలించడం ద్వారా గొంతునొప్పి, దగ్గు నుంచి రిలీఫ్ దొరుకుతుంది. దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు దద్దుర్లు, మొటిమలు వంటి వాటిని కూడా తగ్గించగలవు. కాబట్టి దానిమ్మ తొక్క పొడిలో రోజ్ వాటర్ , తేనె కలిపి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవచ్చు.

చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు కూడా దానిమ్మ తొక్కతో చెక్ పెట్టొచ్చు. దానిమ్మ తొక్కల పొడిలో కాస్త కొబ్బరినూనె కలిపి తలకు పట్టించి, తలస్నానం చేస్తే జుట్టుకు చక్కటి పోషణ అందుతుంది.

నారింజ పండ్లతో పాటు నారింజ తొక్కల్లో కూడా యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. నారింజ పండు తొక్కను గాయాలు, ఇన్ఫెక్షన్‌లకు మందుగా కూడా వాడుకోవచ్చు. నారింజ పండు తొక్కలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు గాయాలను మానేలా చేస్తాయి. అలాగే నారింజ తొక్కలో క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే మొటిమల సమస్య ఉన్నవాళ్లు నారింజ పండు తొక్కలను పొడి చేసి అందులో తేనె కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ఇలా చేస్తే మొటిమలు, మచ్చల నుంచి రిలీఫ్ ఉంటుంది.

అరటి పండు లాగానే అరటి తొక్క కూడా ఎంతో మేలు చేస్తుంది. అరటి పండు తొక్కలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. అలాగే అరటి తొక్కలో ‘ల్యూటిన్’ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది పలు రకాల రుగ్మతలను తగ్గించగలదు. అందుకే తినగలిగితే అరటి తొక్కలు కూడా మంచివే.

కాలిన గాయాలు, పుండ్లు, దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దన చేస్తే గాయాలు త్వరగా మానతాయి. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని దంతాలపై రుద్దడం ద్వారా దంతాలు తెల్లగా మెరుస్తాయి. అరటిపండు తొక్కలో యాంటీ ఏజింగ్ గుణాలు ఎక్కువ. కాబట్టి అరటిపండు తొక్క గుజ్జుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవచ్చు.

Fruits Skin,Fruits,Health Tips
fruits skin, fruits, Health tips, benefits with fruits skin, benefits of fruits skin, అందానికి, ఆరోగ్యానికి పండ్లు

https://www.teluguglobal.com//health-life-style/how-many-benefits-with-fruits-skin-554689