2022-12-13 03:37:58.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/13/430989-salman-khan.webp
సినీ నటుడు సల్మాన్ ఖాన్ బీభత్సంగా కారు నడిపి కొన్ని ప్రాణాలు తోడేసిన కేసు కొట్టేసిన సందర్భంగా డిసెంబర్ 2015 న వ్రాసిన కవిత
బండెళ్ళి పోయింది …
కాళ్ళ మీంచి… కడుపులో
కాళ్ళు పెట్టుకుని
ముడుచుకు పడుకున్న
మామూలు మనుషుల మీంచి …
వాళ్ళు పడుకున్న
సైడ్ వాక్ మీంచి …
అమాయకులు చచ్చిపోయారు
అన్నార్తులు ఆవిరైపొయారు
నిలువ నీడలేని ఆ నలుగురూ
నిద్దట్లోనే నీలుక్కు పోయారు …
గుళ్ళలో గంటలు మోగకముందే
మసీదు లో నమాజ్ మొదలవక ముందే
ఆయన తాగింది మందే
అని తేలక ముందే
పడమటి నగరం
పరుగుల మెరుగులు ఉదయించక ముందే
…
బండెళ్ళిపోయింది
ఆ అభాగ్యుల మీంచి…
మీడియా క్రైడ్ ఫౌల్ … సొ వాట్ …
జరిగిన కథ లో
మలుపుల నలుపులు
నలుపుల మలుపులు
అభిమానుల వలపులు
అధికారుల సలుపులు …
తెగిపడిన
చట్టాల చుట్టాల పలుపులు
సొసైటీ లో ఏపుగా పెరిగిన కలుపులు …
లోనికొచ్చినా మా రాజులా
పోవచ్చని సూచిస్తూ
ఎప్పుడూ తెరిచే ఉంచిన
చెరసాలల తలుపులు
శ్రీమంతుల బలుపులు
అన్నిటినీ మించి
శరణాగత రక్షకుల
చల్లని చూపులు …
దాటుకుంటూ … ఝూమ్మని
బండెళ్ళిపోయింది …
ఆర్థిక అర్భకుల కి జరిగిన
అన్యాయం మీంచి …
కడుపు మండి వచ్చినా
కడుపు నిండి వచ్చినా
ఆల్ ఆర్ ఈక్వల్ అనుకునే
న్యాయ గాంధారికి కూడా
తెలీదు … సమ్మార్ మోర్
ఈక్వల్ దాన్ అదర్స్ … అని
తన … ఇన్సాఫ్ కీ తరాజు
ఎటు టిల్ట్ అవుతోందో
ఎందుకలా అవుతోందో …
ఎవరి వల్ల అవుతోందో …
నల్ల కోట్లా … వెయిస్ట్ కోట్లా
చేతులు మారే కోట్ల నోట్లా
మంది దెగ్గిర కొనిపడేసిన
కోటాను కోట్ల ఓట్లా …
ఎవరు తన చేతిలోని
త్రాసు కింద బరువు పెట్టారో …
పాపం ఆమె
కన లేదూ … విన లేదూ …
అందుకే …
న్యాయాన్యాయాల విచక్షణ లేకుండా
సర్రున దూసుకుని మరీ …
బండెళ్ళిపోయింది …
ఆ ఆవిరయిన బతుకుల మీంచి
వికటాట్టహాసం చేస్తూ
వ్రూం … వ్రూం … అని
పోయినోళ్ళందరూ మంచోళ్ళూ
ఉన్నోళ్ళూ పోయినోళ్ళ
తీపి గురుతులూ …
అన్న ఆత్రేయ పాట
గుర్తొచ్చిందో ఏమో
– – మూర్తి గారు జాలి తలిచారు
ఒదిలేశారు
చాల్లే పొమ్మని
ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్
పనిష్మెంటనీ …
అంతే …
మళ్ళే ఆ లెజండరీ చొక్కా
గుండీలు ఊడాయ్
గుండెలు … వాటిని
కప్పిన కండలూ …
ఒక్క సారి మోర విరిచాయ్ …
దిల్ దీవానా
బిన్ సజ్నాకే … మానేనా
అని తన పాత ప్రేమ గీతాన్ని
కూని రాగం తీస్తూ
ఎగ్గిరి గంతేసి …ఎంచక్కా
పోయాడు … ఆ చొక్కా లేని
“కథ” నాయకుడు
ఆశలు ఆవిరయిన
ఆ అనామకుల ఆనవాళ్ళూ …
ఆ హీరో పాటే పాడాయ్
థడప్ థడప్ కె ఇస్ దిల్ సె
ఆహ్ నికల్తీ రహీ …
ముఝ్ కో సజాది ప్యార్ కీ …
ఐస క్యా గునా కియా …
తొ లుట్ గయే…
హా లుట్ గయే..
తొ లుట్ గయే హం తేరీ మొహోబ్బత్ మే …
అంటూ …
న్యాయ గాంధారి
నల్ల గంతల వెనక నుంచీ
రెండు కన్నీటి చుక్కలు రాల్చింది
కానీ …
మూసి ఉన్న మూతితో మాత్రం
ముస్కురాయించింది
ఇదే మొదటి సారి కాదనీ
ఇదే చివరి సారి అసలే కాబోదనీ …
తను మాత్రం
శాశ్వత కబోదిననీ…
ఆమె మనసు మాత్రం
పోయినోళ్ళని క్షమాపణ
కోరుకుంది … మూలుగుతూ …
అయినా మన చెవుల్లో రింగుమంటునే
ఉన్నాయ్
మోగని ఆ వెళ్ళిపోయిన
బండి హారన్ లూ …
ఆగని చక్రాల
స్క్రీచింగ్ శబ్దాలూ …
అవి లేపిన ధూళి రేణువులూ
ఆవురావురుమంటూ
అదృశ్యమైన ప్రాణాలూ…
– సాయి శేఖర్
Telugu Kathalu,Telugu Poets,Sai Sekhar