దాడులతో కేడర్‌ విధ్వంసం.. కబుర్లతో బాబు కాలక్షేపం

2024-08-23 04:16:28.0

ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవని విమర్శించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణని తెలిపారు.

https://www.teluguglobal.com/h-upload/2024/08/23/1354087-former-cm-jagan-strongly-condemned-the-tdp-attack-on-former-mla-peddareddy-in-tadipatri.webp

రాష్ట్రంలో ప్రజలపై దాడులతో తెలుగుదేశం పార్టీ కేడర్‌ విధ్వంసం సృష్టిస్తుంటే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని ఎండగడుతూ ఈ మేరకు ఆయన గురువారం ’ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని జగన్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవని విమర్శించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణని తెలిపారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు. వైసీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయని, వాహనాలను ధ్వంసం చేశాయని మండిపడ్డారు. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెబుతున్నారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుందంటూ ఆ పోస్టులో ధ్వజమెత్తారు.