దారి దీపం

2022-12-12 08:47:15.0

https://www.teluguglobal.com/h-upload/2022/12/12/430884-sheela-pallavi.webp

నిన్ను నువ్వు కరిగించుకొనే

కొ వ్వొత్తిగా మారకు

మిణుకుమిణుకుమంటూ

చీకటిలో వెలిగే మిణుగురువైతే

నీతోపాటు కొందరికైనా దారి చూపగలవు

కావలసిందల్లా లక్ష్యాన్ని చూపగలిగే

కాసింత నిబద్ధత ,

రవ్వంత నిజాయితీ

ప్రపంచాన్ని

వెలుగులతో నింపే

సూర్య కిరణాలు

మన చుట్టూ

రంగులను అద్దితే

వెలుగుల ప్రపంచమే అందమైనదని మురిసిపోకు

వెలుగు చేరని

సముద్ర గర్భంలో

మరిన్ని రంగులు ఎదురు చూస్తున్నాయి

కావలసిందల్లా ఏరుకోగలిగే

కాసింత ధైర్యం,

రవ్వంత కాంతి.

పైపై నవ్వుల పూలతో

పెదాల్ని

ఎంతఅలంకరించుకున్నా

మనసు లోతుల్లోని మాలిన్యాలు

నిలువెల్లా కుళ్ళబెడుతుంటే

వాటిని ప్రక్షాళన చేయాల్సిన చిరువెలుగు

నీలోనే ముడుచుకు పోయి ఉంది

కావలసిందల్లా చైతన్య పరిచే

కాసింత తెగువ, రవ్వంత ఆత్మవిశ్వాసం.

– శీలా పల్లవి

Sheela Pallavi,Telugu Kathalu